06-02-2026 02:13:51 AM
బీజాపూర్, ఫిబ్రవరి 5 : ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్ జిల్లా అటవీప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. ఆ ఘటనలో మావోయిస్టు కీలక నేత ఉదమ్ సింగ్ మృతిచెందారు. ఘటనాస్థలి నుంచి మృతదేహంతో పాటు ఏకే-47 రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా దళాలు తెలిపాయి. ఆ ప్రాంతంలో ఇంకా మావోయిస్టుల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నాయి.
జిల్లాలోని దక్షిణ అటవీ ప్రాంతంలో సాయుధ మావోయిస్టుల ఉన్నట్లు భద్రతా దళాలకు సమాచారం అందింది. దీంతో జిల్లా పోలీసు, డీఆర్జీ (డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్), కేంద్ర భద్రతా బలగాల సంయుక్తంగా సెర్చ్ ఆపేరషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలో అప్పటికే మాటువేసి ఉన్న మావోయిస్టులు, బలగాలపై కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరపడంతో మావోయిస్టు కీలక నేత ఉదమ్ సింగ్ మృతిచెందినట్లు తెలిపారు.
ఘటనాస్థలం నుంచి మావోయిస్టు మృతదేహంతో పాటు, ఒక ఏకే-47 ఆటోమేటిక్ రైఫిల్ స్వాధీనం చేసుకున్నట్లు బీజాపుర్ ఎస్పీ డాక్టర్ జితేంద్ర యాదవ్ తెలిపారు. అయితే, ఆపరేషన్ ముగిసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్పీ తెలిపారు. ఇంకా మరికొంత మంది మావోయిస్టులు సమీపంలోనే దాక్కుని ఉండే అవకాశం ఉందని పోలీసు లు భావిస్తున్నారు. మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టి సమగ్ర కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోందని, గ్రామస్తులు అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దని హెచ్చరించారు.
12 మంది మావోయిస్టుల లొంగుబాటు
చర్ల (విజయక్రాంతి): చత్తీస్‌గఢ్ రాష్ర్టం బీజాపూర్‌లో గురువారం 12 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపో యారు. తమ వద్ద ఉన్న ఎకె-47, రెండు ఎస్‌ఎల్‌ఆర్ రైఫిల్స్‌ను కూడా పోలీసులకు అప్ప గించారు. ఈ 12 మంది మావోయిస్టులు కాల్పులు, ఐఈడి పేలుళ్లు, దహనం వంటి అనేక తీవ్రమైన మావోయిస్టు సంఘటనల లో పాల్గొన్నారు. జనవరి 1, 2024 నుండి 888 మంది మావోయిస్టులు లొంగిపోయారని బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ తెలిపారు.