23 April, 2026 | 11:21 AM

వైద్యుల సమ్మె విరమణ

23-08-2024 12:19 AM

సుప్రీం సూచనతో విధులకు

డాక్టర్ హత్య ఆధారాలు మార్చేశారు

సుప్రీంకోర్టుకు స్టేటస్ రిపోర్టు ఇచ్చిన సీబీఐ

వైద్యురాలి హత్యను రాజకీయం చేయొద్దు

కేంద్రం, బెంగాల్ సర్కారుకు కోర్టు సూచన

న్యూఢిల్లీ, ఆగస్టు 22: కోల్‌కతాలోని ఆర్జీ కర్ దవాఖానలో వైద్యురాలి అత్యాచారం, హత్యకు నిరసనగా కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్న వైద్యులు వెనక్కు తగ్గారు. సమ్మె విరమించి విధులకు హాజరు అవుతామని డాక్టర్ల సంఘాలు ప్రకటించాయి. ఈ ఘటనను సుమోటో కేసుగా స్వీకరించిన సుప్రీంకోర్టు గురువారం కూడా విచారించింది. ఈ సందర్భంగా కేసు దర్యాప్తు పురోగతిపై సీబీఐ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనానికి స్టేటస్ రిపోర్టు సమర్పించింది. ఈ సందర్భంగా సమ్మె విరమించి విధులకు హాజరుకావాలని సీజేఐ వైద్యులకు సూచించారు. దీంతో వారు సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు.

న్యాయం, వైద్యం ఆగకూడదు

దేశవ్యాప్తంగా వైద్యుల సమ్మెతో పేదలు ఇబ్బందులు పడుతున్నందున వైద్యులు తమ నిరసనపై పునరాలోచించుకోవాలని జస్టిస్ చంద్రచూడ్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘దేశంలో ఏ సేవలు ఆగినా.. న్యాయం, వైద్య సేవలు ఆగకూడదు’ అని అన్నారు. సమ్మెలో ఉన్న వైద్య విద్యార్థులు కాలేజీకి రావటంలేదని హాజరు పట్టీలో ఆబ్సెంట్ అని వేస్తున్నారని నాగపూర్ ఎయిమ్స్ వైద్యుల తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. అందుకు సీజేఐ స్పందిస్తూ.. ‘వాళ్లు విధుల్లో ఉంటే ఆబ్సెంట్ అని వేయరు.

ఒకవేళ విధుల్లో లేకుంటే చట్టంప్రకారం వెళ్తారు. ముందు విధుల్లోకి వెళ్లాలని వారికి చెప్పండి. ఏ వైద్యుడిపై ఎవరూ తీవ్రమైన చర్యలు తీసుకోరు. ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే అప్పుడు మా వద్దకు రండి. ముందైతే వారిని విధుల్లోకి వెళ్లమని చెప్పండి. కొందరు రోగులు వైద్యం కోసం రెండేండ్ల నుంచి ఎదరుచూస్తున్నారు. పేదలకు విసుగు పుట్టించకూడదు’ అని సూచించారు.  వైద్యుల సమస్యలన్నింటినీ నేషనల్ టాస్క్‌ఫోర్స్ పరిశీలిస్తుందని హామీ ఇచ్చారు. కోర్టు సూచనతో సమ్మె విరమిస్తున్నట్టు ఢిల్లీ ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రకటించింది. 

నిందితుడు కామ పిశాచి

వైద్యురాలిపై అత్యాచారం చేసి, దారుణంగా హత్యచేసిన నిందితుడు కామ పిశాచిగా మారాడని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. కేసు దర్యాప్తుపై సీబీఐతోపాటు బెంగాల్ పోలీసులు కూడా కోర్టుకు స్టేటస్ రిపోర్టు సమర్పించారు. ముఖ్యంగా సీబీఐ రిపోర్టులో హత్య జరిగిన విధానం, ఆ తర్వాత చోటుచేసుకొన్న పరిణామాలను వరుస క్రమంలో వివరించింది. ఈ సందర్భంగా బెంగాల్ ప్రభుత్వ న్యాయవాది కపిల్ సిబల్‌పై సీజేఐ ప్రశ్నల వర్షం కురిపించారు. ‘హత్య జరిగిన 14 గంటల తర్వాత పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదుచేశారు. అప్పటిదాకా ఏం చేస్తున్నారు? కాలేజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ విషయం తెలిసిన వెంటనే కళాశాలకు నేరుగా రాకుండా ఎవరితో మాట్లాడుతున్నాడు?’ అని నిలదీశారు.   

రాజకీయం చేయొద్దు

వైద్యురాలి హత్య కేసును రాజకీయం చేయొద్దని కేంద్రం, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాలకు సీజేఐ సూచించారు. బెంగాల్ ప్రభుత్వం తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ డాక్టర్ హత్యపై కేంద్ర ప్రభుత్వం, బీజేపీ చిల్లర ప్రకటనలు చేస్తూ రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. కేంద్రం తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అందుకు స్పందిస్తూ ‘చిల్లర ప్రకటనలు ఎవరూ చేయలేదు. బెంగాల్‌కు చెందిన కేంద్ర మంత్రి అధికారికంగానే స్పందించారు.

టీఎంసీ నేతనే సీఎంవైపు వేలు చూపిస్తే విరిచేస్తామని బెదిరించారు’ అని తెలిపారు. అందుకు సిబల్ స్పందిస్తూ ‘నేను కూడా లిస్టు చదవాలా? బీజేపీ నేత సువేందు అధికారి బుల్లెట్లు పేలుతాయి అని బెదిరించలేదా?’ అని స్పశ్నించారు. దీంతో సీజేఐ కలుగజేసుకొని ఈ అంశాన్ని రాజకీయం చేయొద్దని గట్టిగా సూచించారు. న్యాయవాదులు సమ్మె చేస్తున్న వైద్యులను అధికారులు వేధిస్తున్నారని తెలుపగా.. ‘న్యాయం, వైద్యం సమ్మె చేయకూడదు. ముందు వైద్యులను విధులకు వెళ్లమని చెప్పండి’ అని సూచించారు.