రాహుల్ రైజింగ్.. మోదీ స్టేబుల్
- మహారాష్ట్రలో మరింత బలపడిన పార్టీలు
- హర్యానాలో కాంగ్రెస్ పార్టీవైపే మొగ్గు
- జార్ఖండ్‌లో ఎన్డీయే సంపూర్ణ ఆధిపత్యం
- మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ, ఆగస్టు 22: దేశంలో కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ హవా పెరుగుతున్నదని, ఇన్నాళ్లూ ఏ రాజకీయ నేతకు అందనంత ఆదరణ పొందిన ప్రధాని మోదీకి ప్రజాదరణ ఆగిపోయిందని ప్రముఖ వార్తా సంస్థ ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ నేషన్ సర్వేలో తేలింది. ఇప్పటికిప్పుడు మళ్లీ లోక్‌సభ ఎన్నికలు జరిగితే ఎన్డీయే, ఇండియా కూటమికి ఎంపీ సీట్లలో పెద్దగా తేడా ఏమీ ఉండనప్పటికీ రాహుల్, మోదీ ప్రజాదరణలో మాత్రం మార్పు కనిపిస్తుందని పేర్కొన్నది. త్వరలో ఎన్నికలు జరుగనున్న మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్‌లో ఈ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. కీలక రాష్ట్రం మహారాష్ట్రలో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు తమ మిత్రపక్షాల శక్తులనే లాగేసుకోనున్నట్టు తేలింది.
బలపడిన బీజేపీ, కాంగ్రెస్
మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీ, కాంగ్రెస్ మరింత బలపడినట్టు సర్వేలో తేలింది. మహారాష్ట్రలో మొత్తం 48 లోక్‌సభ స్థానాలుండగా, జూన్‌లో నిర్వహించిన లోక్‌సభ ఎన్నికల్లో అధికార ఎన్డీ యే కూటమి 17 సీట్లకే పరిమితమైంది. బీజేపీ 9, ఏక్‌నాథ్ షిండేకు చెందిన శివసేన 7, అజిత్‌పవార్‌కు చెందిన ఎన్సీపీ 1 సీటు గెలిచాయి. కాంగ్రెస్, శరద్‌పవార్ ఎన్సీపీ, ఉద్ధవ్ ఠాక్రే శివసేన స్పష్టమైన ఆధిపత్యం కనబరిచి 30 సీట్లలో గెలపుకొందాయి.
కాంగ్రెస్ సొంతంగా 13, శివసేన (యూబీటీ) 9, ఎన్సీపీ (పవార్) 8 సీట్లు గెలిచాయి. అయితే, రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు మళ్లీ లోక్‌సభ ఎన్నికలు జరిగితే బీజేపీ 12, కాంగ్రెస్ 16 సీట్లు గెలుస్తాయని, చెరో మూడు సీట్లు పెంచుకొంటాయని సర్వేలో తేలింది. అదే సమయంలో ఈ రెండు పార్టీల మిత్రపక్షాల సీట్లు తగ్గనున్నట్టు వెల్లడించింది. బీజేపీ ప్రభుత్వంపై మరీ ఎక్కువగా కాకున్నా ప్రజల్లో వ్యతిరేకతే ఉన్నదని సర్వే తేల్చింది. సర్వేలో పాల్గొన్నవారిలో 25 శాతం మంది ప్రభుత్వం బాగా పనిచేస్తున్నదని చెప్పారు. 33 శాతం మంది సంతృప్తిగా లేమని తెలిపారు. 34 శాతం మంది కొన్ని విషయాల్లో మాత్రమే సంతృప్తిగా ఉన్నామని వెల్లడించారు.
హర్యానాలో కాంగ్రెస్‌కే మొగ్గు
అక్టోబర్ 1వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న హర్యానాలో అధికార బీజేపీకి ఎదురుగాలి వీస్తున్నదని మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో తేలింది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీకంటే బలంగా ఉన్నదని వెల్లడైంది. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ఆరు, బీజేపీ 4 సీట్లు గెలుస్తాయని సర్వేలో తేలింది. ఈ రాష్ట్రంలో 10 లోక్‌సభ స్థానాలున్నాయి. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు చెరో ఐదు లోక్‌సభ సీట్లు గెలిచాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి 47.61 శాతం ఓట్లు రాగా, ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే 45.8 శాతం వస్తాయని సర్వే తేల్చింది. అధికార ఇండియా కూటమికి కూడా విచిత్రంగా ఓట్ల శాతం 46.11 నుంచి 44.2 శాతానికి పడిపోయింది. ఈ సర్వేను జూలై 15వ తేదీ నుంచి ఆగస్టు 10 వరకు నిర్వహించారు.
జార్ఖండ్‌లో ఎన్డీయే ఆధిపత్యం
జేఎంఎం, కాంగ్రెస్ కూటమి పాలనలో ఉన్న జార్ఖండ్‌లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రతిపక్ష ఎన్డీయే కూటమి స్పష్టమైన ఆధిపత్యం సాధిస్తుందని మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే తేల్చింది. రాష్ట్రంలో 14 లోక్‌సభ స్థానాలుండగా, ఎన్డీయే 11 గెలుచుకొంటుందని అంచనా వేసింది.






