23 April, 2026 | 9:48 AM

కవితకు మళ్లీ అస్వస్థత

23-08-2024 01:02 AM
  1. వైరల్ ఫీవర్, గైనిక్ సమస్యలు
  2. ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించి వైద్యపరీక్షలు
  3. ప్రస్తుతం నిలకడగా కవిత ఆరోగ్యం

న్యూఢిల్లీ, ఆగస్టు 22: ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయి తీహార్ జైలులో రిమాండ్ ఖైదు అనుభవిస్తున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన జ్వరంతోపాటు గైనిక్ సమస్యలతో ఆమె బాధపడుతున్నట్టు తెలిసింది. కవితను జైలు వైద్యుల సిఫారసు మేరకు సిబ్బంది గురువారం ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించి చికిత్స అందించారు. అక్కడ వైద్యులు వైద్యపరీక్షలు నిర్వహించి ఆమె జ్వరంతో పాటు గైనిక్ సమస్యలతో బాధపడుతున్నట్లు నిర్ధారించారు.

ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గతంలో కూడా కవిత జ్వరంతో బాధపడ్డారు. అప్పుడు కూడా ఆమెకు ఎయిమ్స్‌లో చికిత్స అందించారు. లిక్కర్ స్కాం కేసులో ఆమె మార్చి 15న అరెస్ట్ అయ్యారు. ఐదు నెలలుగా ఆమె జైలులోనే ఉన్నారు. అనారోగ్య కారణాలను చూపుతూ కవిత సీబీఐ, ఈడీ కేసుల్లో బెయిల్ ఇవ్వాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ఇప్పటికే ఈడీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.