26 April, 2026 | 2:48 AM

ఎంగిడి తలకు తీవ్ర గాయం

26-04-2026 01:20 AM

హాస్పిటల్‌కు తరలింపు

ప్రస్తుతం నిలకడగా ఆరోగ్యం

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ లుంగి ఎంగిడి తీవ్రంగా గాయపడ్డాడు. క్యాచ్ అందుకునే క్రమంలో వెనక్కి పడిపోయిన లుంగి ఎంగిడి తలకు తీవ్ర గాయమైంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతన్ని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఫిజియో మాటలకు ఎంగిడి స్పందించినా లేవలేకపోయాడు. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ సందర్భంగా అక్షర్ పటేల్ వేసిన మూడో ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ ఓవర్ మూడో బంతిని ప్రియాన్ష్ ఆర్య భారీ షాట్ ఆడగాబంతి మిడాఫ్ దిశగా గాల్లోకి లేచింది. అక్కడే ఫీల్డింగ్ చేసిన లుంగి ఎంగిడి వెనక్కి పరుగెత్తుతూ క్యాచ్ అందుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బంతిని అంచనా వేయడంలో విఫలమై వెనక్కి పడిపోయాడు. దాంతో అతని తల నేలకు బలంగా తాకింది. ఈ గాయం ధాటికి అలానే పడిపోయిన ఎంగిడి నొప్పితో విలవిలలాడాడు. ఫిజియో వచ్చి గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అంబులెన్స్ను మైదానంలోకి రప్పించి ఆసుపత్రికి తరలించారు.

ఈ అనూహ్య ఘటన అందర్నీ షాక్‌కు గురిచేసింది. తొలుత డాక్టర్లకు సహకరించిన ఎంగిడి.. ఆ తర్వాత చలనం లేకుండా ఉండిపోయాడు. తలకు బ్యాండేజ్ వేసి స్ట్రెచ్పర్‌పై అతడిని ఆసుపత్రికి తరలించారు. ఎంగిడి స్థానంలో కంకషన్ సబ్స్టిట్యూట్గా దుష్మంత చమీరా బరిలోకి దిగాడు. వైద్యులు అందించిన చికిత్సతో తర్వాత ఎంగిడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు ఐపీఎల్ వర్గాలు తెలిపాయి. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినట్టు వెల్లడించాయి. ఎంగిడి లాంటి బౌలర్ దూరమవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ బలహీనంగా మారి ఓటమి పాలైంది.