4 August, 2026 | 1:56 AM

రాజన్న అన్నప్రసాద నాణ్యతపై ఈవో ఆకస్మిక తనిఖీ

04-08-2026 12:00 AM

అన్నదాన సత్రంలో నిరంతర పర్యవేక్షణ: ఆలయ ఈఓ రమాదేవి

వేములవాడ, ఆగస్టు 3, (విజయ క్రాంతి):వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అన్నప్రసాద సత్రంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎల్ రమాదేవి సోమవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. భక్తులకు అందిస్తున్న అన్నప్రసాద సేవల నాణ్యత, పరిశుభ్రతను పరిశీలించారు.సత్రంలో నిల్వ ఉన్న బియ్యం, కూరగాయలు, ఇతర ఆహార సామగ్రిని తనిఖీ చేసిన ఈవో, వంటశాలను సందర్శించి వంట పాత్రలు, స్టవ్ లు , ఇతర సామగ్రి పరిశుభ్రతను పరిశీలించారు.

అన్నప్రసాదం తీసుకుంటున్న భక్తులకు స్వయంగా వడ్డించి ఆహారం నాణ్యత, రుచి, సేవలపై అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. భక్తులు సంతృప్తి వ్యక్తం చేయడంతో సేవలను మరింత మెరుగుపర్చాలని అధికారులకు సూచించారు.పాత్రలు శుభ్రం చేసే సిబ్బందితో మాట్లాడిన ఈవో, ప్రతి పాత్రను పరిశుభ్రంగా కడగడంతో పాటు వంటశాల పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.అన్నప్రసాద పర్యవేక్షకుడు ఒన్నారం భాస్కర్ తో కలిసి సత్రంలోని వివిధ విభాగాలను పరిశీలించిన ఆమె,

భక్తులతో మర్యాదగా వ్యవహరించాలని, వారి సమస్యలు, సూచనలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.భక్తులకు నాణ్యమైన, రుచికరమైన, పరిశుభ్రమైన అన్నప్రసాదం అందించడం దేవస్థానం ప్రధాన బాధ్యత. సేవల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని ఈవో ఎల్ రమాదేవి తెలిపారు.