సాహితీ దీపస్తంభం ఏటుకూరి
తెలుగు అభ్యుదయ సాహిత్యోద్యమానికి, ప్రచురణ రంగానికి ఏడు దశా బ్దాల పాటు అనన్యసామాన్యమైన సేవలు అందించిన డాక్టర్ ఏటుకూరి ప్రసాద్ (ఏటుకూరి బాలశంకర ప్రసాదరావు) శనివారం రా త్రి కన్నుమూశారు. ఆయన మరణం తెలుగు సాహిత్య లోకానికి, ముఖ్యంగా అభ్యుదయ రచయితల సంఘానికి తీరని లోటు.
జీవితకాలం ఆయన సాహిత్యరంగంలోనే ఉన్నారు. వందలాది మంది కవులను, రచయితలను తీర్చిదిద్దారు. వందలాది కమ్యూనిస్టు కవులు, రచయితల వ్యాసాలు, కవితలు ఆయన కృషితోనే ప్రచురితమయ్యాయి. తాను నమ్మిన కమ్యూనిస్టు భావజాలానికి కట్టుబడి చివరకు పనిచేశారు. ఏటుకూరి 1936 జూలై 19న గుంటూరులో వజ్రమ్మ, కోటయ్య దంపతుల కు జన్మించారు. ఆయన విద్యాభ్యాసం స్వస్థలంలోనే సాగింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో ఎంఏ పట్టా పొందారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) నుంచి బీఎడ్, పీహెచ్‌డీ పట్టాలు సైతం సాధించారు. గుంటూరు ఏసీ కళాశాలలో ట్యూటర్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత హైదరాబాద్ అగర్వాల్ పాఠశాల, జూనియర్ కళాశాలల్లో పాఠాలు బోధించారు. ఎస్డీఎస్ ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాలలో రీడర్‌గా పదవీ విరమణ చేశారు. ఒకవైపు ఉపాధ్యాయుడిగా సేవలందిస్తూనే, మరోవైపు ఉపాధ్యాయ సంఘాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. నిరంతరం విద్యా ర్థులను అభ్యుదయ భావాల వైపు నడిపించారు. తెలంగాణ ప్రైవేటు, ఎయిడెడ్ స్కూల్ టీచర్స్ గిల్డ్ సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎయిడెడ్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్లలో చురుకైన సభ్యుడిగా ఉన్నారు. ఉపాధ్యాయుల హక్కుల కోసం ఎల్లప్పుడూ ముందు నిలిచారు. ఆయ న జీవన సహచరి చింతలపాటి కుసుమకుమారి టీచర్‌గా పనిచేశారు. కొన్నేళ్ల క్రితం ఆమె వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు. వారి కుమారుడు అరుణ్‌ప్రసాద్ మల్టీమీడియా, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ రంగాల్లో స్థిరపడ్డారు.
ప్రజా ఉద్యమాలపై మక్కువ
తెలుగు జర్నలిజం రంగంపైనా ఏటుకూరి ముద్ర ఉంది. విద్యార్థి దశలోనే ఆయన విశాలాంధ్ర సాంస్కృతిక ప్రతినిధిగా పనిచేశారు. గుంటూరు నుంచి వెలువడిన ‘యువజన’ మాసపత్రికకు సంపాదకత్వం వహించా రు. న్యూఢిల్లీ ఇన్ఫా న్యూస్ ఏజెన్సీలో తెలుగు అనువాద కుడిగా సేవలందించా రు. సుదీర్ఘ కాలం పాటు ‘అభ్యుదయ’ మాసపత్రికకు సంపాదకుడిగా వ్యవహరించారు. ‘వీచిక’ మాసపత్రికకు ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
పత్రికా రంగం ద్వారా అభ్యుదయ భావజాలాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. రచయితగా ఆయన కలం నుంచి అద్భుతమైన ప్రజా బాణీలు వచ్చాయి. ఎర్రజెండా పాటలు, ఎర్రబాట పాటలు, పోరాట పాటలు విశేష ప్రజాదరణ పొందాయి. ‘శివాలయ్య’ రూపకం ఆయన నాటక రంగాభిమా నానికి నిదర్శనం. తాపీ ధర్మారావు జీవితం సాహిత్యంపై ఆయన చేసిన పరిశోధనా గ్రంథం తెలుగు సాహిత్యంలో ఒక మైలురాయి.
వైబిఎస్ ప్రసాదరావు, నగజేశ్వర్, అరు ణ, ఎస్పీ, ప్ర.కా, శంకరం వంటి మారుపేర్లతో ఎన్నో వ్యాసాలు రాశారు. సంకలనాల సంపాదకత్వంలో ఆయనది ప్రత్యేక శైలి. ‘ఆంధ్రా శాసనసభ్యులు’ సంకలనానికి సహ సంపాదకత్వం వహించారు. జర్మన్ కవి బ్రెహ్ట్ కవితల ను ‘రేపటి కోసం’ పేరుతో సంకలనం వెలువరించారు. కొంపెల్ల జనార్దనరావు, తుమ్మల సీతారామమూర్తి, అబ్బూరి రామకృష్ణారావు, శిష్ట్లా ఉమామహేశ్వరరావుల జీవితం, సాహిత్యంపై ప్రత్యేక గ్రంథాలు తెచ్చారు. అభ్యు దయ రచయితల సంఘం యాభై ఏళ్ల చారిత్రక పత్రాలను భద్రపరిచారు.
తొలితరం కమ్యూనిస్టుల సేవలు గ్రంథస్థం
తొలితరం కమ్యూనిస్టుల త్యాగాలను ఏటుకూరి గ్రంథస్థం చేశారు. రాజకీయంగా ఆయన జీవితకాలం కమ్యూనిస్టు సిద్ధాంతాలకు కట్టుబడి జీవించారు. 1951లో ఆల్ ఇం డియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ద్వారా తొలిసారిగా ఆయన ప్రజాఉద్యమాల్లోకి వచ్చా రు. 1955లో అభ్యుదయ రచయితల సంఘంలో చేరారు. 1959లో కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. చివరి శ్వాస వరకు పార్టీ సభ్యుడిగా కొనసాగారు. హైదరాబాద్ నగర పార్టీ సమితిలో బాధ్యతలు నిర్వహించారు. అభ్యుదయ రచయితల సం ఘం ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా జాతీయ స్థాయిలో సేవలు అందించారు. ప్రచురణ రంగంలోనూ ఆయన సేవలు వెలకట్టలేనివి.
విశాలాంధ్ర ప్రచురణాలయం సంపాదకవర్గంలో సుదీర్ఘ కాలం ఉన్నారు. ఆ తర్వాత నవచేతన ప్రచురణాలయం సంపాదకుడిగా బాధ్యతలు చేపట్టారు. వందలాది ఉత్తమ గ్రంథాల ప్రచురణకు కారణమయ్యారు. ఆకాశవాణిలో ముప్పుకి పైగా రేడియో ప్రసంగాలు చేశారు. ఎన్నో సాహితీ సదస్సుల్లో పరిశోధనా పత్రాలు సమర్పించా రు. ఆయన సాహిత్యంపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసి ఓ స్కాలర్ డాక్టరేట్ పట్టా కూడా పొందాడు.
ఏటుకూరి సాహిత్య సేవకు ఎన్నో పురస్కారాలు లభించాయి. పులుపుల శివయ్య, సుంకర, తుమ్మ ల, తాపీ ధర్మారావు సాహిత్య పురస్కారాలు అందుకున్నారు. శ్రీశ్రీ బంగారు పతకం, కిన్నెర శ్రీశ్రీ పురస్కారం సైతం పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి తాపీ ధర్మారావు జర్నలిజం ప్రతిభా పురస్కారం అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి గురజాడ సాహితీ పురస్కారం అందుకున్నారు. డాక్టర్ పోరంకి దక్షిణామూర్తి, వల్లూరి శివప్రసాద్ వంటి ప్రముఖులు తమ రచనలను ఈ దంపతులకు అంకితమిచ్చారు. ఏటుకూరి జీవితం వర్గ రహిత సమాజ స్థాపనకు, అభ్యుదయ సాహిత్య వికాసానికి అంకితమైంది.
దశాబ్దాల పాటు ఆయన సాగించిన అక్షర ప్రయాణం రాబోయే తరాలకు మార్గదర్శకం. ఆయన నిరాడంబరత, సిద్ధాంత నిబద్ధత కవులకు, రచయితలకు ఎల్లప్పుడూ ఆదర్శంగా నిలుస్తాయి. తెలుగు సాహిత్య వినీలాకాశంలో ఆయన ఒక ధ్రువతారగా వెలుగుతూనే ఉంటారు. అభ్యుదయ సాహి త్య రథసారథి, బహుముఖ ప్రజ్ఞాశాలి ఏటూరికి వేవేల అంజలులు.
రతన్ రుద్ర
78421 95755






