చివరి సంతకం
గూట్లో పుస్తకం
రెపరెపలాడుతోంది
నిశ్శబ్దంలో శబ్దం
చూపుల్నే కాదు
మనసును కట్టేస్తుంది
పుస్తకానికి హస్తంతో
నేస్తం కుదిరింది
తెరవడమే తరువాయి
మొదటి పేజీ!
అమ్మానాన్నల
అనురాగాల సవ్వడి
ఆనందాల లోగిలి
బడి ఒడిలో పాఠాలు
దోస్తులతో సయ్యాటలు
ఎన్నిసార్లు చదివినా
ఎన్నిసార్లు లిఖించినా
తనివి తీరని
కమ్మని కావ్యం బాల్యం
మధ్య పేజీలు!
మధురానుభూతులు
మనసు తోటలో
చిగురించిన ప్రేమలేఖలు
ఊహలలో విహరించే
రంగుల లోకం
మళ్లీ మళ్లీ నెమరేసుకునే
అద్భుత దృశ్య కావ్యం
యౌవనం చివరి పేజీ!
చివరి మజిలీ
పరిచయాలు పలకరింపులు
పలుచబడిన తెల్ల కాగితం
ఎందుకో.. ఈ వేళ
ఎగిసిపడుతోంది
బయట గాలివాన యుద్ధం
చుట్టూ చీకటి
ఉరుములు మెరుపులు
గదిని వణికిస్తున్నాయి
గోడమీది క్యాలెండర్
ముఖం తిప్పేసుకుంది
వయసు మీద పడగానే
ఒంటరితనంపై
జ్ఞాపకాలు దాడి చేస్తాయి
గతాన్ని నెమరేసుకుంటూ
మనసు పొరలు వసుకుంటాయి
బల్లమీది గాజుబొమ్మ
ముక్కలైంది.
చివరి పేజీలో సంతకం చేసి
కట్టె మట్టిలో కలిసింది.
ఎ.నాగాంజనేయులు






