సుప్రీం అసహనం!
ఇటీవల దేశవ్యాప్తంగా తల్లిదండ్రులకు, విద్యార్థులకు ఆగ్రహం కలిగించిన ‘నీట్’ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టు సోమవారం చేసిన వ్యాఖ్యలు కీలకమైనవి. 2024 సంవత్సరంలో నీట్ ప్రశ్నపత్రం లీక్ అయిన ఘటన తర్వాతి పరిణామాల నుంచి, ప్రతి ఏటా ఆ పరీక్షలను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఎలాంటి గుణపాఠాలు నేర్చుకో లేదని దేశంలోని అత్యున్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది.
ఈ ఏడాది మే 8న దేశవ్యాప్తంగా జరిగిన నీట్ యూజీ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ కావడం వివాదాస్పదమైంది. అప్పటినుంచి లక్షలాది మంది తల్లిదండ్రు లు, విద్యార్థుల ఆగ్రహం, ఆందోళనలో వున్నారు. వైద్యవిద్య ప్రవేశ పరీక్ష నిర్వహణ ఇకనైనా ఎన్‌టీఏ నుంచి తప్పించి, పరీక్ష నిర్వహణను ఒక స్వతంత్ర సంస్థకు అప్పగించాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఇదే విషయంపై సుప్రీంకోర్టు తలుపుతట్టింది.
నిజానికి, 2024లో నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయిన ఘటనపై సుప్రీంకోర్టు అప్పుడు ఒక మానిటరింగ్ కమిటీని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఆ కమిటీ చేసిన ప్రతిపాదనలను అప్పుడు ఎన్‌టీఏ అంగీకరించింది. అయితే అవి అమలయ్యాయా లేదా అనేదే అసలు ప్రశ్న. అవి అమలు జరిగివుంటే ఈ ఏడాది ‘నీట్’ ప్రశ్నపత్రం లీక్ అయివుండేది కాదనేది విద్యావేత్తల అభిప్రాయం. ఆ కమిటీ ప్రతిపాదనలను అమలు చేసేం దుకు ఏమి చర్యలు తీసుకున్నారో గురువారం లోగా అఫిడవిట్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఎన్‌టీఏను ఆదేశించింది.
నీట్ ప్రశ్నాపత్రం లీక్‌పై సుప్రీంకోర్టు ఇలా అసహనం వ్యక్తం చేయడం, గత చేదు అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకోకపోవడం విచారకరమని చెప్పడం.. దేశంలో పరీక్షల నిర్వహణ లోపాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నవారికి కొంత ఉపశమనాన్ని ఇచ్చిందనే చెప్పాలి. కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్‌కు సంబంధించిన ‘నీట్’ పరీక్ష నిర్వహణ మొదటినుంచి వివాదాస్పదమవుతూనే వుంది. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, భద్రతపై విద్యార్థుల తల్లిదండ్రులు మొదటినుంచి ఆందోళన వ్యక్తంచేస్తూనే వున్నారు.
జరిగిన ఘోర తప్పిదానికి బాధ్యతవహిస్తూ, కేంద్ర విద్యామంత్రి తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పలుమార్లు డిమాండ్ చేసింది. సంస్కరణల బాటలో ‘నీట్’ పరీక్షా విధానంలో మార్పు ఉంటుందా, పరీక్షల నిర్వహణ మరో సంస్థకు అప్పగించడం జరుగుతుందా అని విద్యార్థు లు ప్రశ్నిస్తున్నారు.






