యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభం
హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ ఆధ్వర్యంలో 10 రోజులపాటు జరగనున్న యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్ శుక్రవారం సాయంత్రం ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని ప్రసాద్ లాబ్స్ ప్రివ్యూ థియేటర్‌లో ఈ నెల 15 వరకు ఈ వేడుక నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా యూరప్‌లోని 24 దేశాలకు చెందిన 24 అవార్డు చిత్రాలను షెడ్యూల్ ప్రకారం ప్రదర్శిస్తారు. ఫ్రెంచ్ మూవీ ‘జిమ్స్ స్టోరీ’ని ప్రారంభ చిత్రంగా ప్రదర్శించారు. వేడుక ప్రారంభోత్సవానికి సినీరంగంతోపాటు పలువురు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. నిర్మాత సీ కల్యాణ్ మాట్లాడుతూ.. ‘ఫిల్మ్ ఫెస్టివల్స్‌ను రెగ్యులర్‌గా నిర్వహించేందుకు ప్రభుత్వ సహకారాన్ని కోరతాం.
హైదరాబాద్ వేదికగా రెండేళ్లకోకసారి జరిగే చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ తిరిగి నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది’ అని తెలిపారు. సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ మాట్లాడుతూ.. ‘ఈ ఫెస్టివల్స్‌లో ప్రదర్శిస్తున్న వాటిలో 12 మంది మహిళా మేకర్స్ తీసిన సినిమాలు ఉండటం ఓ విశేషం’ అన్నారు. హైదరాబాద్ ఫిలిం క్లబ్ అధ్యక్షుడు కేవీ రావు, సెక్రటరీ ప్రకాశ్‌రెడ్డి, తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరశంకర్, సీనియర్ దర్శకుడు రేలంగి నరసింహారావు, పొన్నం రవిచంద్ర, మౌడ్ మిక్కుయాన్, పూనమ్ కపిల్ తదితరులు పాల్గొన్నారు.






