15 July, 2026 | 5:09 AM

మనల్ని మనం అవమానించుకున్నట్లే

08-12-2024 12:00 AM

ప్రపంచ వ్యాప్తంగా ‘పుష్ప 2’ రికార్డుల మీద రికార్డులు కొల్లగొడు తోంది. అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా ఉండటంతో భారీగా ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంటోంది. ఈ చిత్రానికి ఎక్కువ థియేటర్లు కేటాయించడంపై కొందరు ఉత్తరాది వారు అసహనం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ సినిమా కారణంగానే ‘ఇంటర్ స్టెల్లార్’ రీ రిలీజ్ వాయిదా పడిందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ విషయంపై సోషల్ మీడియాలో ఓ మీమ్స్ పేజ్  పెట్టిన పోస్ట్‌పై కథానాయిక జాన్వీ కపూర్ స్పందించారు.

‘పుష్ప 2’కు మద్దతుగా నిలిచారు. మన చిత్రాన్ని తక్కువ చేసి హాలీవుడ్ చిత్రానికి మద్దతు తెలియజేస్తున్న కొందరి తీరును ఆమె తప్పుబట్టారు. “పుష్ప 2’ మన సినిమానే కదా.. ఎందుకు మరొక దానితో పోలుస్తూ తక్కువ చేస్తున్నారు? మీరు హాలీవుడ్ సినిమాను సపోర్ట్ చేస్తుంటే.. హాలీవుడ్ వారు మన సినిమాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మనం మాత్రం మన సినిమాలను తక్కువ చేసుకుంటూ.. మనల్ని మనమే అవమానించుకుం టున్నాం. ఇలాంటివి చూసినప్పుడు బాధగా ఉంటుంది” అని జాన్వీ పేర్కొన్నారు. తెలుగు సినిమాకు మద్దతు ఇవ్వడంపై జాన్వీపై టాలీవుడ్ ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం జాన్వీ.. రామ్ చరణ్‌తో కలిసి సినిమా చేస్తున్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో ‘ఆర్‌సీ 16’ పేరుతో ఇది రూపొందుతోంది.