సామాన్యులపై ఇంధన భారం
దేశంలో పెట్రోల్, డీజల్ ధరలు పెరగడం అనేది కేవలం వాహనదారుల సమస్య మాత్రమే కాదు. అది దేశ ఆర్థిక వ్యవస్థపై, మధ్యతరగతి కుటుంబాల జీవన విధానంపై, పేద ప్రజల రోజువారీ ఖర్చులపై ప్రత్యక్ష ప్రభావం చూపే ప్రధాన సమస్య. ఇంధన ధరలు పెరిగిన ప్రతిసారి మార్కెట్లో ప్రతి వస్తువు ధర పెరుగుతుంది.
రవాణా ఖర్చులు పెరుగుతాయి. కూరగాయల నుంచి నిర్మాణ సామగ్రి వరకు అన్నింటి ధరలు సామాన్యుడి చేతికి అందకుండా కొండెక్కుతాయి. పెట్రోల్, డీజల్ ధరల పెరుగుదల ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఉద్యోగుల జీతాలు, చిన్న వ్యాపారుల ఆదాయాలు, కూలీల సం పాదన అదే స్థాయిలో ఉండగా, జీవన వ్యయం మాత్రం రోజురోజుకూ పెరుగుతోంది.
ముఖ్యంగా రెక్కాడితేనేగాని డొక్కాడని మధ్యతరగతి, పేద ప్రజలపై ధరల పెరుగుదల భారం ఎక్కువగా ఉంటుంది. పెట్రోల్, డీజల్ ధరల ప్రభా వం రవాణా రంగంపై పడుతుంది. బస్సులు, ఆటోలు, లారీలు, ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలు అన్నీ ఇంధనంపై ఆధారపడి ఉంటాయి. రవాణా ఖర్చులు పెరగడంతో మార్కెట్లో సరుకుల ధరలు కూడా పెరుగుతాయి. పేద కుటుంబాలు ఇప్పటికే అద్దె, విద్య, వైద్యం, ఆహారం వంటి అవసరాల కోసం ఇబ్బందులు పడుతున్నాయి. ఇంధన ధరల పెరుగుదలతో వారి జీవితం మరింత కష్టమవుతోంది.
మధ్యతరగతి కుటుంబాలు కూడా ఈఎంఐలు, పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు నిర్వహించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. డీజల్ ధర పెరుగుదలతో బోర్లు, ట్రాక్టర్లు, పంట రవాణా ఖర్చులు పెరుగుతాయి. చివరకు రైతు ఆదాయం తగ్గిపోతుంది. పెట్రోల్, డీజల్ ధరల్లో కేంద్ర ప్రభుత్వ పన్నులు కీలక పాత్ర పోషిస్తాయి. ఎక్సైజ్ డ్యూటీ రూపంలో కేంద్రం భారీ ఆదాయం పొందుతోంది. ప్రజలపై భారాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం పన్నులు తగ్గించే అవకాశం ఉన్నప్పటికీ, ఆ దిశగా సరైన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ప్రజల ఆదాయాలు పెరగకుండానే ఇంధన ధరలు పెరగడం వల్ల జీవన వ్యయం అదుపు తప్పుతోంది.
దేశ ఆర్థికాభివృద్ధి కోసం ఆదాయం అవసరమే అయినప్పటికీ, ఆ భారాన్ని పూర్తిగా సామాన్యులపై మోపడం సరైంది కాదు. కేంద్ర,--రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం తప్ప ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలిగించడం లేదు. ధరల నియంత్రణ కోసం దీర్ఘకాలిక విధానాలు అవసరం. ప్రజారవాణా వ్యవస్థను బలోపేతం చేయడం, ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ప్రోత్సహించడం, పన్నుల విధానంలో పారదర్శకత తీసుకురావడం వంటి చర్యలు చేపట్టాలి. పెరుగుతున్న ఇంధన ధరలు ప్రజల పొదుపులను పూర్తిగా దెబ్బతీస్తున్నాయి.
ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, డెలివరీ సిబ్బంది, క్యాబ్ డ్రైవర్లు నేరుగా ప్రభావితమవుతున్నా ప్రభుత్వాలు దృష్టిసారించడం లేదు. ఇంధన ధరల పెరుగుదల కేవలం ఆర్థిక సమస్య కాదు; అది సామాజిక ప్రభావం కలిగిన అంశం. ధరల పెరుగుదలతో పేదలు మరింత పేదలవుతారు, మధ్యతరగతి ఆర్థిక ఒత్తిడిలోకి నెట్టబడుతుంది. ఈ నేపథ్యంలో ప్రజల జీవన వ్యయాన్ని నియంత్రించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత అని గుర్తించాలి.
బూర్గుపల్లి కృష్ణయాదవ్, 9866170384






