calender_icon.png 5 February, 2026 | 12:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందరివాడు గాంధీజీ!

11-06-2024 12:00:00 AM

ఈ శతాబ్దపు వివిధ రంగాల్లో ప్రపంచ ప్రముఖులు ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, ఆంగ్‌సాన్ సూకీ, రవీంద్రనాథ్ ఠాగూర్, సీవీ రామన్, బెర్నార్డ్ షా, మార్టిన్ లూథర్ కింగ్, దలైలామా, నెల్సన్ మండేలా, స్టీవ్ జాబ్స్, కైలాష్ సత్యార్థి, బరాక్ ఒబామా, చార్లీ చాప్లిన్ ప్రభృతులు ఎందరో గాంధీజీ నుంచి స్ఫూర్తి పొందిన వారే. ఈ శతాబ్దపు అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో గాంధీజీ ఒకరు. కొన్ని సందర్భాల్లో జీసస్, గౌతమ బుద్ధుడు, శ్రీకృష్ణుడు వంటి వారి బోధనలను ఆచరించి చూపిన కారణజన్ముడుగా, యుగ పురుషుడుగానూ గాంధీజీ ప్రశంసలు పొందారు. 

సత్యం, అహింస పునాదులపై విశ్వమానవతా ప్రేమ శిఖరాన్ని సందేశంగా, మన దేశపు ముఖచిత్రంగా నిలిపిన వారాయన. ఆ మార్గంలో నడిచి ఎంతోమంది నోబెల్ బహుమతులూ గెలిచారు. కానీ, కొన్ని కారణాల వల్ల గాంధీజీకి నోబెల్ బహుమతి ప్రకటించలేక పోయినందుకు ఆ కమిటీ విచారం వ్యక్తంచేసింది కూడా. ఎన్నో ప్రపంచ స్థాయి ఉద్యమాలకు సత్యాగ్రహం, నిరాహారదీక్ష వంటి శాంతియుత మార్గాలే మార్గదర్శకమవుతు న్నాయి. ఆ మేరకు అద్భుత ఫలితాలనిస్తున్నాయి.

మూడవ ప్రపంచ యుద్ద పోకడలు కనిపిస్తున్న ప్రస్తుత తరుణంలో యావత్ ప్రపంచానికి ఒకే ఒక దిక్సూచి గాంధీజీ. కన్నుకు కన్నే సమాధానం అయితే ఈ ప్రపంచం గుడ్డిదై పోతుందన్నారు. ప్రకృతి మన అవసరాలను మాత్రమే తీరుస్తుంది కానీ, కోరికలను కాదని ఆయన సూచించారు. పట్టణీకరణ ముసుగులో గ్రామాలే ఈ దేశానికి పట్టుకొమ్మలు అన్న విషయాన్ని మరువకూడదని మహాత్ముడు అన్నారు. ఆయుర్వేదం, ధ్యానం వంటి ఆరోగ్య విధానాలను తాను ఆచరించి నేటి తరానికి ఆదర్శమయ్యారు.

గాంధీజీ ఆత్మకథ ‘మై లైఫ్ ఎక్సఫర్ మెంట్స్ విత్ ట్రూత్’ (సత్యంతో నా జీవిత ప్రయోగాలు) పుస్తకం ప్రఖ్యాత గ్రంథం బైబిల్ స్థాయిలో గొప్ప గుర్తింపు పొందింది. ప్రపంచస్థాయిలో విశ్వమానవుడిగా అ‘సాధారణ’ వ్యక్తిగా గుర్తింపు పొందిన గాంధీజీని నేడు మన భారతీయులలో కొందరు కులమత కోణంలో చూస్తూ సంకుచితంగా ఆలోచించడం భావ్యం కాదు. మన దేశ స్వాతంత్య్ర సంగ్రామానికి మాత్రమే ఆయనను పరిమితం చేస్తూ, కొన్ని రాజకీయ పార్టీలు చేసే ప్రచారాలు ఇకనైనా ఆపాలి. అందరివాడుగా వున్న ఆయనను కొందరివాడుగా చేయడం మానుకోవాలి. ‘గాంధీ పుట్టిన దేశం’ అంటూ ప్రపంచం మనల్ని గౌరవిస్తున్న తీరుతో ప్రతి భారతీయుడి గుండె గర్వపడాలి. ఆయన కలలుకన్న విశ్వశాంతి వికాసానికి మనమంతా సమిధలం కావాలి.

ఫిజిక్స్ అరుణ్ కుమార్