calender_icon.png 4 February, 2026 | 10:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ భూతం ఆట కట్టించలేమా?

11-06-2024 12:00:00 AM

భారతదేశంలో వినియోగదారుల మార్కెట్ ఇటీవలి కాలంలో భారీగా పెరిగిపోయింది. కొనుగోలుదారులు పెరిగే కొద్దీ మార్కెట్‌లో డూప్లికేట్ లేదా నకిలీ ఉత్పత్తులు ప్రత్యక్షమవడం కూడా పెరుగుతోంది. అదీ ఇదీ అని కాదు, కంప్యూటర్, టీవీ, ఫ్రిజ్ మొదలుకొని నిత్యం వాడే టూత్‌పేస్ట్ దాకా అన్నీ నకిలీ ఉత్పత్తులు వచ్చేస్తున్నాయి. పేరు మోసిన బ్రాండ్‌లాగా కనిపించే ఈ నకిలీ వస్తువులు నాణ్యత విషయంలో ఆ స్థాయిలో ఉండవు. తక్కువ ధరలో వస్తున్నాయి కదా, అన్న ఆశతో వీటిని కొంటే ఆ తర్వాత బాధపడాల్సి వస్తుంది. 

ఏ ఎలక్ట్రానిక్ వస్తువో లేదా ఫర్నీచర్ లాంటిదో అయితే డబ్బు మాత్రమే నష్టపోతాం. అదే ఆహార పదార్థాలు, చాక్లెట్లు లాంటివి అయితే వారి ఆరోగ్యాన్ని దెబ్బ తీయడమే కాదు, ఒక్కోసారి ప్రాణాం తకం కూడా అవుతాయి. కొన్ని బ్రాండ్ల పేరు చెబితే చాలు, కళ్లు మూసుకుని కొనేయొచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే, అవి నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తాయి. అందుకు తగ్గట్టే ధర కూడా ఉంటుంది. వినియోగదారులకు తమ మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకొంటూ ఉంటాయి కాబట్టే, అలాంటి బ్రాండెడ్ వస్తువుల వ్యా పారం ఏళ్లు గడిచినా మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతుంటుంది.

దుస్తులు, చెప్పులే కాదు చాక్లె ట్లు, సబ్బులు, డిటర్జెంట్లు, టూత్ పేస్టులు, బిస్కట్లు, చివరికి మినరల్ వాటర్ ఇలా రకరకాల ఉత్పత్తులకు పేరున్న బ్రాండ్లు ఉన్నాయి. బ్రాండ్ ఇమేజ్ అనేది  వినియోగదారుల కొనుగోళ్లు, అమ్మకాల్లో కీలకం. ఈ కారణంగానే ప్రతి కంపెనీ కూడా తమ ప్యాకింగ్‌ను, వాటిపై కనిపించే పేర్లను ఇతర సంస్థలకు భిన్నంగా, చూడగానే వినియోగదారులు గుర్తించేలా తయారు చేస్తుంటాయి. అదే నకిలీ వస్తువులను తయారు చేసే వారికి మంచి అవకాశంగా మారింది. ఈ నకిలీ వస్తువులు కూడా చూడడానికి బ్రాండెడ్ వస్తువులలాగా ను కనిపిస్తాయి. కొద్దిపాటి తేడా మాత్రమే ఉంటుం ది.  పట్టి చూస్తే తప్ప అది నకిలీదని గుర్తించలేం. ఒకేలా పలికే అక్షరాన్ని పేరులో చేర్చి అమ్మేస్తుంటారు.

అయిదో స్థానంలో భారత్

నకిలీ వస్తువులను అత్యధికంగా ఎగుమతి చేసే దేశాల్లో  చైనా, టర్కీ అగ్రస్థానంలో నిలిస్తే భారత్ అయిదో స్థానంలో ఉంది. యూరోపియన్ యూనియన్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కార్యాలయంతో ఆర్గనైజేషన్ ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ సంస్థ కలిసి నిర్వహించిన సర్వేలో ఈ అంశం వెల్లడయింది. నకిలీ వస్తువులను అత్యధికంగా ఎగుమతి చేస్తున్న దేశాల్లో వరసగా చైనా, టర్కీ, సింగపూర్, థాయ్‌లాండ్, భారత్ తొలి అయిదు స్థానాల్లో ఉన్నాయి. దీనిలో చైనాకు 63 శాతం ఉంటే, టర్కీ 3.3 శాతం, సింగపూర్ 1.9 శాతం, థాయ్‌లాండ్ 1.6 శాతం, భారత్ 1.2 శాతం నకిలీ వస్తువుల వాణిజ్యం చేస్తున్నాయని ఆ సర్వే పేర్కొంది.

అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా 2.5 శాతం నకిలీ వస్తువులు మార్కెట్లోకి దిగుమతి అవుతున్నాయని తెలిపింది. ఈ దేశాలనుంచి నకిలీ వస్తు వులు దిగుమతి అవుతున్న దేశాల్లో అమెరికా, ఇటాలియన్, ఫ్రెంచ్  ఉన్నాయని తేలింది. అమెరికాలో గత ఏడాది  జనవరినుంచి అక్టోబర్ మధ్య కాలం లో దాదాపు వందకోట్ల డాలర్ల విలువైన నకిలీ వస్తువులు పట్టుబడ్డాయని ఫెడరల్ అధికారులు వెల్లడించారు. పట్టుబడిన వస్తువుల్లో హ్యాండ్‌బ్యాగ్స్, షూస్, విలాస వస్తువులు ఉన్నాయని ఫెడరల్ అధికారులు తెలిపారు. అమెరికా చరిత్రలోనే నకిలీ వస్తు వుల వ్యవహారంలో ఇదే అతి పెద్దది. 

ఎరువులు, విత్తనాలు కూడా!

వినియోగ వస్తువుల సంగతి అటుంచితే విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారకాలు లాంటివి కూడా నకిలీవి తయారవుతున్నాయి. ఈ విత్తనాలు, క్రిమి సంహారకాలను తయారు చేసేవారు ఇచ్చే ప్రకటనలను నమ్మి రైతులు చివరికి దిగుబడి రాక నిలువునా నష్టపోతున్నారు. ఇలా ప్రతి రంగంలోనూ నకిలీ లేదా డూప్లికేట్ వస్తువుల కారణంగా కస్టమర్లకు కోట్ల రూపాయలు ప్రతి ఏటా నష్టం వాటిల్లుతున్నది. మరోవైపు వీటి తయారీదారులు మాత్రం లాభాలు దండుకొంటున్నారు. వినియోగదారులు ఇటీవలి కాలంలో ఆన్‌లైన్ షాపింగ్ పెరగడం కూడా ఇలాంటి నకిలీ వస్తువుల తయారీదారుల పంట పండేలా చేస్తోంది.

ఖరీదైన వస్తువుల విషయంలో మోసపోతే డెలివరీ చేసే వారిపై చట్టపరంగా పోరాటం చేయవచ్చు కానీ, వందల్లో ఉండే వస్తువయితే కోర్టుల చుట్టూ ఎవరు తిరుగుతారన్న భావనతో చాలామంది ఫిర్యాదు కూడా చేయడం లేదు. వినియోగదారుల ఉద్యమం దేశంలో బలంగా లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. నకిలీ వ్యాపారాన్ని కట్టడి చేయాల్సిన ప్రభుత్వ అధికారులు అడపాదడపా దాడులు జరుపుతున్నారు కానీ, చట్టాలు కఠినంగా లేకపోవడం వల్ల తయారీదారులు తేలికపాటి శిక్షలు లేదా జరిమానాలతో బయటపడుతున్నారు. సమాజాన్ని పట్టి పీడించే ఈ నకిలీ భూతం భరతం పట్టేందుకు చట్టాలను మరింత కఠినతరం చేయడంతోపాటు దాడులు కూడా ఎక్కువ చేసి దోషులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతయినా ఉంది.