calender_icon.png 5 February, 2026 | 2:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాత్రికులపై అమానుషం

11-06-2024 12:00:00 AM

జమ్మూ, కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. రియాసి జిల్లాలోని శివ్‌ఖోరా ఆలయం నుంచి కట్రాలోని మాతా వైష్ణోదేవి ఆలయానికి వెళుతున్న యాత్రికుల బస్సుపై దాడి చేసి విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 10 మంది చనిపోయిన విషయం తెలిసిందే. మరో 33 మంది గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి భవన్‌లో నరేంద్ర మోడీ మంత్రివర్గం మూడోసారి కొలువు దీరడానికి గంటముందు జరిగిన ఈ దుర్ఘటనతో  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి. బస్సులోని ప్రయాణికుల్లో  ఎక్కువమంది యూపీ, బీహార్ రాష్ట్రాలకు చెందిన వారేనని తెలుస్తోంది.

తాము వాస్తవానికి సాయంత్రం 4 గంటలకు బయలుదేరాల్సి ఉండిందని, అయితే ఆలస్యమయిందని దాడిలో ప్రాణాలతో బయటపడిన బాధితులు చెప్పడం గమనార్హం. బస్సు బయలుదేరిన కొద్దిసేపటికే ఉగ్రవాదులు నాలుగు వైపులనుంచి దాడి చేసి కాల్పులు జరిపారని, కాల్పుల్లో బస్సు డైవర్ గాయ పడడంతో బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయిందని వారు తెలిపారు. అయినప్పటికీ టెర్రరిస్టులు కాల్పులు ఆపలేదని, దీంతో తాము చనిపోయినట్లుగా కదలకుండా పడి ఉండి ప్రాణాలు కాపాడుకున్నామని తెలిపారు. కాగా, బస్సుపై దాడి చేసింది తామేనని పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు అనుబంధంగా ఉన్న ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’(టీఆర్‌ఎఫ్) ప్రకటించుకొంది.

అంతేకాదు, ఇది ఆరంభం మాత్రమేనని, మరిన్ని దాడులు జరుపుతామనీ హెచ్చరించింది. కాగా, జమ్మూ, కశ్మీర్‌లో యాత్రికుల బస్సుపై ఉగ్రదాడి జరగడం గత 30 ఏళ్లలో ఇది రెండోసారి. 2017 జులైలో అనంత్‌నాగ్ జిల్లాలో అమర్‌నాథ్ యాత్రికుల బస్సుపై జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు మృతి చెందగా మరో 17 మంది గాయపడ్డారు. తర్వాత జరిగిన పెద్ద దాడి ఇదే. అంతేకాదు, పొరుగున ఉన్న రాజౌరీ, పూంఛ్ జిల్లాలతో పోలిస్తే రియాసి జిల్లాలో ఇప్పటివరకు ఉగ్రవాద కార్యకలాపాలు చాలా తక్కువే.  దీంతో భద్రతా దళాలు సైతం ఈ జిల్లాపై ఎక్కువ దృష్టిపెట్టలేదు.

అయితే, రాజౌరీ, పూంఛ్ జిల్లాల్లో పాక్ ఉగ్రవాద ముఠాలను ఏరివేయడానికి భద్రతాదళాలు నిత్యం గాలింపు కొనసాగిస్తుండడంతో అక్కడి నుంచి టెర్రరిస్టులు జిల్లాలోకి తమ స్థావరాలను మార్చి ఉంటారని భద్రతా అధికారులు అనుమానిస్తున్నారు.  తాజా ఘటన నేపథ్యంలో ఆర్మీ, రాష్ట్ర పోలీసులు, సిఆర్‌పీఎఫ్‌లతో కూడిన సంయుక్త దళాల తాత్కాలిక ప్రధాన స్థావరాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి టెర్రరిస్టుల కోసం డ్రోన్లతో అడవి అంతా జల్లెడ పడుతున్నారు. ఎన్‌ఐఏ కూడా రంగంలోకి దిగింది.

కశ్మీర్ బస్సుపై ఉగ్రదాడిపై కేంద్ర మంత్రి అమిత్ షా తీవ్రంగా స్పందించారు. దాడి చేసిన వారిని మట్టుబెట్టే దాకా వదిలేది లేదని ప్రకటించారు. తాజా పరిస్థితిని తెలుసుకోవడానికి మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అయిన వెంటనే కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ మిశ్రా, డీజీపీతో ఫోన్‌లో మాట్లాడారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని, శాంతిభద్రతల పరిస్థితి మెరుగుపడిందని మోడీ ప్రభుత్వం చెప్పుకొంటోంది.  ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో జమ్మూ, కశ్మీర్‌లో పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతోపాటు పోలింగ్ శాతమూ గణనీయంగా పెరిగింది.

ఈ  నేపథ్యంలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలను కూడా త్వరలో నిర్వహించాలని మోడీ సర్కార్ భావిస్తోంది. ఈ తరుణంలో జరిగిన ఈ దాడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఒక్కసారిగా అప్రమత్తమయ్యేలా చేసింది. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరుతున్న సమయంలో, పలు దేశాలకు చెందిన అధినేతలు ఢిల్లీలో ఉన్న ఉండగా, జరిగిన ఈ దాడి కశ్మీర్‌లో శాంతిభద్రతలపై కేంద్రం చెబుతున్న వాదనలోని డొల్లతనాన్ని బయటపెట్టిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సర్కార్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ దాడిద్వారా కశ్మీర్‌లో ఉగ్రవాదం ఇంకా పడగెత్తుతూనే ఉందని, ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని మరోసారి రుజువైంది.