30 July, 2026 | 6:20 PM

పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

30-07-2026 05:41 PM

సుల్తానాబాద్ ఎంఈఓ ఆరేపల్లి రాజయ్య

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ హితమైన అలవాట్లను ప్రతి ఒక్కరూ అలవరచుకోవాలని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల విద్యాధికారి  ఆరేపల్లి రాజయ్య అన్నారు. గురువారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జడ్పీహెచ్‌ఎస్ గర్రెపల్లిలో నిర్వహిస్తున్న ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయుల (3) రోజుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్య పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని స్టీల్ ప్లేట్లను తీసుకువచ్చి భోజనం చేయడానికి వినియోగించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.

ఉపాధ్యాయులు సమాజానికి మార్గదర్శకులు అని పేర్కొన్న ఆయన, ఉపాధ్యాయులు ఆచరించే మంచి అలవాట్లను విద్యార్థులు, తల్లిదండ్రులు, సమాజం అనుసరిస్తారని అన్నారు. అందువల్ల పర్యావరణ పరిరక్షణలో ఉపాధ్యాయులు ముందుండి ఆదర్శంగా నిలవాలని, ప్లాస్టిక్‌కు బదులుగా పునర్వినియోగ వస్తువులను వినియోగిస్తూ పర్యావరణ హిత జీవన విధానాన్ని ప్రోత్సహించాలని సూచించారు.పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా సహకరించాలని, చిన్న చిన్న మార్పులే భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించగలవని మండల విద్యాధికారి ఆరేపల్లి రాజయ్య పిలుపునిచ్చారు.