సావిత్రిబాయి పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి అజ్మీరా శ్యామ్ నాయక్
కుమ్రంఆసిఫాబాద్ (విజయక్రాంతి): దేశంలో మహిళా విద్యాభివృద్ధి కోసం, అణచివేతకు గురైన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి ప్రదాత అని ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి అజ్మీరా శ్యామ్ నాయక్ అన్నారు.
మంగళవారం జిల్లా కేంద్రంలోని అఖిల భారతీయ మాలీ సంఘం జిల్లా కార్యాలయంలో సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతి వేడుకలు జిల్లా అధ్యక్షుడు గుర్నులే మెంగాజీ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అజ్మీరా శ్యామ్ నాయక్ వివిధ సంఘాల నాయకులతో కలిసి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి పూలే చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. సమాజంలో కుల వివక్ష లేని సమానత్వ సమాజం కోసం ఆమె చేసిన పోరాటం గొప్పదని కొనియాడారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే సావిత్రిబాయి పూలే ఆశయాలు నెరవేరుతాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ మాలీ సంఘం గౌరవ అధ్యక్షుడు కవాడే దత్తు, ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు రేగుంట కేశవ్ రావు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రూప్నార్ రమేష్, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు వైరగడే మారుతి పటేల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ విశ్వనాథ్, మాలీ సంఘం నాయకులు సెండే సోమేశ్వర్, హనుమంతు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎం.డి. నిజాం, సోషల్ వర్కర్ డోంగ్రి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.




