2 July, 2026 | 6:30 PM

ఉర్దూ మీడియం ప్రీ-ప్రైమరీ పాఠశాలలు ఏర్పాటు చేయాలి

02-07-2026 05:50 PM

మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా డిమాండ్

జిల్లా కలెక్టర్,డీఈవో,జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారికి వినతిపత్రం

కొత్తగూడెం,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో పేద,మధ్యతరగతి కుటుంబాల చిన్నారులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రారంభించనున్న ప్రీ-ప్రైమరీ పాఠశాలల్లో(Urdu Medium Schools) ఉర్దూ మీడియాన్ని కూడా ప్రవేశపెట్టాలని మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా జిల్లా కలెక్టర్‌ను కోరారు.ఈ విద్యా సంవత్సరంలో జిల్లాలో 118 ప్రీ-ప్రైమరీ పాఠశాలలు ప్రారంభించనున్న నేపథ్యంలో జిల్లా ,మండల కేంద్రాల్లో ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ఉర్దూ మీడియం ప్రీ-ప్రైమరీ పాఠశాలలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.

తెలంగాణలో ఉర్దూ రెండవ అధికార భాషగా ఉన్నప్పటికీ, కాలక్రమేణా దాని వినియోగం తగ్గిపోతోందని పేర్కొన్నారు. చిన్నారులకు ప్రాథమిక దశ నుంచే ఉర్దూ మాధ్యమంలో విద్యను అందించడం ద్వారా భాష పరిరక్షణతో పాటు అభివృద్ధికి కూడా తోడ్పాటు అందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.అలాగే ఉర్దూ మీడియం విద్య అందుబాటులోకి వస్తే మైనారిటీ విద్యార్థులు తమ మాతృభాషలో విద్యాభ్యాసం ప్రారంభించే అవకాశం లభిస్తుందని, ప్రభుత్వ విద్యా వ్యవస్థపై మరింత విశ్వాసం పెరుగుతుందని తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారికి వినతిపత్రాలు సమర్పించినట్లు యాకూబ్ పాషా వెల్లడించారు.