బ్లాక్‌బాక్సుల్లా ఈవీఎంలు
- వాటిని పరిశీలించేందుకు కూడా వీలు లేదు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శలు
ఈవీఎంలపై వివాదం రేపిన మస్క్ ట్వీట్
మాజీ మంత్రి చంద్రశేఖర్‌తో ట్వీట్స్ వార్
చర్చలోకి ఎంటరైన రాహుల్, అఖిలేశ్
న్యూఢిల్లీ, జూన్ 16: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యి పదిరోజులు గడిచిపోయినా ఈవీఎంలపై వివాదం ఇంకా సద్దుమణగటం లేదు. ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఈవీఎంల పనితీరుపై ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఈ వివాదంలో ఎక్స్ (ట్విట్టర్) అధినేత ఎలాన్ మస్క్ పెట్రోల్ పోసి మరింత మంటలు రేపారు. ఆయన ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తంచేస్తూ ట్వీట్ చేశారు. వెంటనే అందుకున్న కేంద్ర ఎలక్ట్రానిక్స్ శాఖ మాజీ మంత్రి చంద్రశేఖర్.. మస్క్‌కు కౌంటర్లు వేయటం ప్రారంభించారు. దీంతో ఈ వివాదంలోకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ ఎంటరయ్యారు. ఇంకేముందు ఈవీఎంలపై ట్వీట్ల వార్ దుమ్మురేగిపోయింది.
మొదలు పెట్టిన కెన్నెడీ
ఎన్నికల్లో టెక్నాలజీ వాడకంపై అనుమానాలు వ్యక్తంచేస్తూ అమెరికా అధ్యక్ష ఎన్ని కల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాబర్ట్ కెన్నడీ జూనియర్ ఓ పోస్టు పెట్టారు. ప్యూర్టోరికోలో జరిగిన ఎన్నికల్లో ఈవీఎంలనే వాడారు. ఆ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి ఫలితాలను మార్చేశారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ ఎన్నికలను ఉటంకిస్తూ కెన్నెడీ ‘అదృష్టం కొద్ది పేపర్ ట్రయల్స్ నిర్వహించారు. దానివల్ల సమస్యలను గుర్తించి, ఓట్ల లెక్కలు సరిచూసేందుకు వీలు కలిగింది’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు మస్క్ రిప్లు ఇస్తూ ‘ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను పూర్తిగా తీసివేయాలి. వాటిని మనుషులు లేదా ఏఐ హ్యాక్‌చేయటం సాధారణ విషయమే అయినా ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది’ అని పేర్కొన్నారు.
మస్క్ ట్వీట్‌కు కేంద్ర మాజీ మంత్రి చంద్రశేఖర్ కౌంటర్ ఇచ్చారు. ‘ఈవీఎంలపై మస్క్ విశ్లేషణ అమెరికా లేదంటే వేరే ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుంది. కానీ భారత్‌కు వర్తించదు. ఎందుకంటే వాళ్లు ఇంటర్నెట్‌తో అనుసంధానమైన ఓటింగ్ యంత్రాలను వాడుతారు. కానీ, భారతీయ ఈవీఎంలు ప్రత్యేకంగా రూపొందించినవి. ఎంతో సురక్షితమైనవి. ఏ నెట్‌వర్క్‌కు, మీడియాకు అందనివి. నో కనెక్టెవిటీ, నో బ్లూటూత్, వైఫై, ఇంటర్నెట్.. అందువల్ల హ్యాక్ అయ్యే అవకాశమే లేదు.
వాటిని తయారుచేసిన కంపెనీవాళ్లు కూడా వాటిలోని ప్రోగ్రామ్‌ను మార్చలేరు. దీనిపై మస్క్‌కు ట్యూషన్ పెట్టాలన్నా సంతోషంగా ప్రారంభిస్తాం’ అని చురకలంటించారు. చంద్రశేఖర్ ట్వీట్‌కు మస్క్ తీవ్రంగా స్పందించారు. ‘దేన్నైనా హ్యాక్ చేయవచ్చు’ అని పేర్కొన్నారు. అందుకు ‘ఏదైనా సాధ్యమే’ అని ట్వీట్ చేశారు. ఇలా వీరి మధ్య ట్వీట్స్ వార్ నడుస్తుండగానే రాహుల్‌గాంధీ, అఖిలేశ్‌యాదవ్ ఈ వివాదంలోకి దూకారు.
ఈవీఎంలు బ్లాక్ బాక్సులే
ఈవీఎంలపై ఎప్పటినుంచో విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ.. ఈ సందర్భంగా మరోసారి విమర్శలు గుప్పించారు. ‘భారత్‌లో ఈవీఎంలకు బ్లాక్ బాక్కుల్లాంటివి (విమానాల్లో వాడుతారు). వాటిని విశ్లేషించేందుకు ఎవరికీ అవకాశం ఉండదు. మన ఎన్నికల నిర్వహణలో పారదర్శకతపై తీవ్రమైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వ్యవస్థలు జవాబుదారీగా లేనప్పుడు ప్రజాస్వామ్యం అవమానకరంగా ముగిసిపోతుంది’ అని ట్వీట్ చేశారు.
ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ముంబై నార్త్ స్థానం నుంచి గెలుపొందిన శివసేన ఎంపీ రవీంద్ర వైకర్ బంధువు మంగేశ్ పండ్లికర్ తన ఫోన్‌తో ఈవీఎంను అనుసంధానించినట్టు వచ్చిన వార్త క్లిప్‌ను రాహుల్ తన ట్వీట్‌కు అనుసంధానించారు. వైకర్ 48 ఓట్ల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావటంతో మంగేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. దీంతో తన ఫోన్‌తో ఈవీఎంను అనుసంధానించినట్టు మంగేశ్ ఒప్పుకొన్నాడని పోలీసులు తెలిపారు. ఈ రిపోర్టునే రాహుల్‌గాంధీ ఆధారంగా చూపారు.
బీజేపీకి అంత ప్రేమ ఎందుకు?
ట్విట్టర్ వార్ ఇలా కొనసాగుతుండగా ఎస్పీ అధినేత కూడా అందులోకి ప్రవేశించారు. మస్క్ పోస్టును ఆయన షేర్ చేశారు. ‘టెక్నాలజీ సమస్యలను పరిష్కరించాలి. ఒకవేళ అదే సమస్య అయితే.. దాని వాడకాన్ని వెంటనే ఆపేయాలి. ప్రపంచవ్యాప్తంగా అనేక ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని వార్తలు వస్తున్నాయి. సాంకేతిక నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా బీజేపీ వాటివైపే ఎందుకు మొగ్గుచూపుతున్నదో స్పష్టంచేయాలి’ అని ట్వీట్ చేశారు.






