అమెరికాతో మైత్రి మరింత బలోపేతం
18-06-2024 04:36 AM
- అమెరికా ఎన్‌ఎస్‌ఏతో ప్రధాని
న్యూఢిల్లీ, జూన్ 17: అమెరికాతో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంచుకొనేందుకు భారత్ సిద్ధంగా ఉన్నదని, ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. భారత్‌లో పర్యటిస్తున్న అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాక్ సల్లివాన్ సోమవారం మోదీని కలిశారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య రక్షణ, వ్యూహాత్మక, ప్రాంతీయ సహకారం తదితర అంశాల్లో జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. విదేశాంగ మంత్రి జైశంకర్‌తో కూడా సల్లివాన్ భేటీ అయ్యారు. క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ (ఐసీఈటీ)పై రెండో సమావేశం కోసం విస్తృత స్థాయి చర్చలు జరిపారు. ప్రధాని మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం అమెరికాకు చెందిన సీనియర్ అధికారి పర్యటించడం ఇదే మొదటిసారి.






