08-01-2026 10:02:24 PM
హైదరాబాద్: శివ శివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (ఎస్ఎస్ఐఎం) 27వ సమన్వయ్ 2026 మెగా ఫెస్ట్ ఉత్సాహంగా ప్రారంభమైంది. సినీ నటుడు శుభలేఖ సుధాకర్ ముఖ్యఅతిథిగా హాజరై దీనిని ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరుగుతున్న ఈ వేడుకల్లో ఐదు రాష్ట్రాల్లోని 100 కాలేజీలకు చెందిన 3 వేల మందికి పైగా విద్యార్థులు పాల్గొంటున్నారు. విద్యార్థుల్లో నిర్వహణ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, సమన్వయం వంటి వాటిని నేర్చుకునే అవకాశం కల్పించడమే ఈ సమన్వయ్ 2026 ముఖ్య ఉద్దేశం. నేటి ప్రపంచం చాలా వేగంగా మార్పు చెందుతోందని, యువత టెక్నికల్ గా అడ్వాన్స్ గా ఉన్నారని నటుడు శుభలేఖ సుధాకర్ చెప్పారు. ఎన్ని మార్పులు వచ్చినా తల్లిదండ్రులకు గురువులకు మనం ఇచ్చే గౌరవం ఎల్లప్పుడూ ప్రథమంగా ఉండాలని ఆయన సూచించారు.
ప్రారంభోత్సవం సందర్భంగా వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. సుమారు 13 రకాల ఈవెంట్స్ నిర్వహణలో మొదటి రోజు ఫార్మల్ ఈవెంట్స్, ఇన్ఫార్మల్ ఈవెంట్స్ మొదటి రౌండ్స్ జరిగాయి. రెండో రోజు అన్ని ఈవెంట్స్ ఫైనల్ రౌండ్స్ జరుగుతాయి. శ్రేష్ఠ - ది యంగ్ మేనేజర్ లో గెలుపొందిన విద్యార్థులకు యాభై వేలు నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రాన్ని అందచేస్తారు. ప్రధమ స్థానంలో నిలిచిన కళాశాలకు సర్తాజ్ ఆఫ్ సమన్వయ్ ట్రోఫీని బహుకరిస్తారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ అండ్ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డా. శైలేష్ సంపతి, వైస్ ప్రెసిడెంట్ దీపికా సంపతి, ఇంచార్జి డైరెక్టర్ డా. ఎన్ఆర్ కెఎస్ చక్రవర్తి, సమన్వయ్ కోఆర్డినేటర్లు డా. పవన్ పటేల్, Mr. మాధవ్ మూర్తి , డా. పి గౌరీ కుసుమ , డా. కామేశ్వరి, Mr. కార్తీక్, విద్యార్థులు, బోధన మరియు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.