12 March, 2026 | 5:51 AM

కేంద్ర మాజీ మంత్రి కావూరి కన్నుమూత

12-03-2026 02:11 AM

ప్రజాసేవకు ఆయన జీవితం అంకితం: కిషన్‌రెడ్డి

కావూరి డైనమిక్ లీడర్: విజయక్రాంతి చైర్మన్ సీఎల్ రాజం

హైదరాబాద్, మార్చి 11 (విజయక్రాంతి): కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు బుధవారం కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. స్టార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. 

కావూరి సాంబశివరావుకు 82 ఏళ్లు. 198 4, 1989, 1998లో మచిలీపట్నం నుంచి.. 2004, 2009లో ఏలూరు నుంచి మొత్తంగా ఐదుసార్లు ఆయన ఎంపీగా గెలుపొందారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా జౌళి శాఖను నిర్వహించారు. సాంబ శివరావుకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆయనకు నాలుగు దశా బ్దాలకుపైగా రాజకీయ చరిత్ర ఉంది.

కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన సాంబశివరావు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరా రు. ఆ తర్వాత ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కావూరి సాంబశి వరావు అంత్యక్రియలను గురువారం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో నిర్వహించను న్నట్లు ఎంపీ భరత్ తెలిపారు. సాంబశివరావు మృతిపై తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ప్రజాసేవకే జీవితం అంకితం: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

కావూరి సాంబశివరావు మృతిపట్ల కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన అనారోగ్యంతో కన్నుమూశారని తెలిసి విచారం వ్యక్తం చేశారు. ఐదు సార్లు ఎంపీగా, కేంద్రమంత్రిగా ఆయన ప్రజాసేవకు తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. రాజకీయంలో ఆయనకున్న సుదీర్ఘ అనుభవంతో.. ప్రజాసమస్యలపై పార్లమెంటు లోపలా, బయటా తన గళాన్ని వినిపించారని, ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు కిషన్‌రెడ్డి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

మరణ వార్త బాధించింది: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు అనారోగ్యంతో మరణించారన్న వార్త తనను తీవ్రంగా బాధించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు పేర్కొన్నారు. బడుగు, బలహీనవర్గాలకు ఆయన ఎంతో సేవచేశారని, సాదాసీదాగా ఉంటూ అప్యాయంగా పలకరించేవారని గుర్తుచేశారు. వారి మరణం తెలుగు ప్రజలకు తీరనిలోటని, ఆయ న ఆత్మకు శాతి కలగాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. కుటుంబసభ్యులకు, అభి మానులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

డైనమిక్ లీడర్: సీఎల్ రాజం, విజయక్రాంతి చైర్మన్

కావూరి సాంబశివరారు డైనమిక్ లీడర్ అని, ఇక ఆయన లేరనే వార్త తనను తీవ్రంగా కలిచివేసిందని విజయక్రాంతి దినపత్రిక చైర్మన్ సీఎల్ రాజం తెలిపారు. వరంగల్‌లోని రీజనల్ ఇంజినీరింగ్ కాలేజీలో (ఇప్పుడు ఎన్‌ఐటీ) ఆయన తనకు సూపర్ సీనియర్ అని గుర్తుచేసుకున్నారు. సామాన్య కుటుంబంలో పుట్టిన సాంబశివరావు వ్యాపార రంగంలో రాణించారని తెలిపారు. ఆయ న జీవితం అందరికీ ఆదర్శప్రాయమని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.