ఇది బ్లాక్ డే
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ తీర్పు అత్యంత అప్రజాస్వామికం
- ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు
- అసలు దోషి రాహుల్ గాంధీయే.. స్పీకర్‌పై ఆయన ఒత్తిడి
- ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదు
- దేశంలో అతిపెద్ద జోకర్ రాహుల్ గాంధీ
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్
హైదరాబాద్, మార్చి 11 (విజయక్రాంతి) : పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపైన స్పీకర్ ఇచ్చిన తీర్పు అత్యంత అప్రజాస్వామికమని, ఇది చీకటిరోజు అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని కేటీఆర్ దుయ్యబట్టారు. రాహుల్‌గాంధీ ఆడిస్తున్న ఆటలో భాగంగానే స్పీకర్ ప్రసాద్‌కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన విమర్శించారు.
అసెంబ్లీ స్పీకర్‌పైన రాహుల్ గాంధీ తీవ్రమైన ఒత్తిడి ఉన్నదని, రాష్ట్రం నుంచి వస్తున్న అడ్డగోలు సంచుల కట్టల కోసం ఇలాంటి అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. శాసనసభ స్పీకర్ చేతుల్లో ఏమీలేదని, మొత్తం కాంగ్రెస్ పార్టీనే ఈ ఫిరాయింపుల వ్యవహారాన్ని దగ్గరుండి నడిపించిందని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగంపై దాడి అని, దీని వెనుక ఉన్న ప్రధాన నేరస్థుడు, ఆ నేరపూరిత ఆలోచన రాహుల్ గాంధీదే.. ఆయనే అసలు దోషే అని విమర్శించారు.
ఎందుకంటే ఆయన అనుమతి లేకుండా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఇంత టి దారుణమైన నిర్ణయం తీసుకునే సాహ సం చేయలేరని స్పష్టంచేశారు. ఒకవైపు రాహుల్‌గాంధీ భారత రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ దానికి రక్షకుడినని చెప్పు కుంటూ, ఈరోజు పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయంతో రాహుల్ గాంధీ ఒక జోకర్‌గా నిలిచిపోయారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
స్పీకర్‌ను సత్కరిస్తాం..
పార్టీ ఫిరాయిస్తే ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ అని చెప్పిన రాహుల్‌గాంధీ, తెలం గాణ వచ్చి న్యాయపత్రాల గురించి ఉపన్యాసాలు దంచిన రాహుల్‌గాంధీ, స్పీకర్ తీసుకున్న నిర్ణయం పైన ఏం సమాధానం చెబుతారని కేటీఆర్ ప్రశ్నించారు. ఒక పార్టీ బీ ఫారం పైన గెలిచిన ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ బీఫారంతో ఎంపీగా పోటీచేసిన తర్వాత కూడా ఆ వ్యక్తిని అనర్హుడిగా ప్రకటించకుండా, విచారణ పేరుతో సాగదీసి ఈరోజు ఆ ఎమ్మెల్యేకు అనుకూలంగా తీర్పు చెప్పడం అంటే అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు.
చేతిలో రాజ్యాంగం పట్టుకుని తిరుగుతూ ఉపన్యాసాలు ఇచ్చే అదే రాహుల్ గాంధీ, తుక్కుగూడలో ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి మాట్లా డారు. ఒక పార్టీ బీ -ఫారమ్ మీద ఎమ్మెల్యేగా గెలిచి, రాజీనామా చేయకుండానే మరో పార్టీ బీ -ఫారమ్ మీద ఎంపీగా ఎలా పోటీచేస్తారు? అని ప్రశ్నించారు. స్వతంత్ర భారత చరిత్రలో ఏ స్పీకర్ కూడా ఇంత అద్భుతమైన నిర్ణయం తీసుకోలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
అందుకే మేము స్పీకర్‌ను చప్పట్లతో, శాలువాలతో సత్కరించి మా కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నామని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఏ బీ -ఫారమ్ వాడారు, ఎంపీగా ఏ బీ -ఫారమ్ వాడుతున్నారో అక్కడ స్పష్టంగా ఉందని, ఇంత జరిగినా స్పీకర్ అనర్హత పిటిషన్‌ను తిరస్కరించారంటే, ఖచ్చితంగా ఆయనను, అయనను నడిపిస్తున్న కాంగ్రెస్ నేతలను కూడా సత్కరించాల్సిందే అని ఎద్దేవా చేశారు.
అన్ని సాక్ష్యాలు ప్రజల ముందు ఉన్నప్పటికీ కూడా విచారణ చేయాల్సిన అవసరం ఏముందని.. ఆలోచించాల్సిన అవసరం ఏముందని కేటీఆర్ ప్రశ్నించారు. అందుకే చేసేవి అనైతిక కార్యక్రమాలు, చెప్పేవి నీతులు అన్నట్టు రాహుల్ గాంధీ తీరు ఉందని, అందుకే ఆయనను దేశంలోనే అతిపెద్ద జోకర్ అంటున్నానని కేటీఆర్ తెలిపారు. రాహుల్ గాంధీ లాంటి జోకర్లకు తెలంగాణ ప్రజలే సమాధానం చెబుతారని తెలిపారు.
థర్డ్ క్లాస్ మాటలెందుకు..
ఇక ఫిరాయింపుల సంస్కృతి గురించి మాట్లాడే నైతిక హక్కు రాహుల్ గాంధీకి గానీ, కాంగ్రెస్ పార్టీకి గానీ లేనేలేదన్నారు. రాహుల్‌గాంధీ నాయనమ్మ ఇందిరా గాంధీ హర్యానాలో మొదలుపెట్టిన ఫిరాయింపుల రాజకీయం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు పాకిందని వెల్లడించారు. 2004లో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో 26 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే, 10 మందిని తీసుకున్నది కాంగ్రెస్ కాదా అన్న విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు.
ఇక ఫిరాయింపుల అంశం పైన దానం నాగేందర్, కడియం శ్రీహరిలు చేసిన కామెంట్స్ చూస్తే నవ్వు వస్తున్నదని, కడియం శ్రీహరి పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నాడు కానీ, ఎలాంటి పరిస్థితులలో బీఆర్‌ఎస్‌లోకి వచ్చారు, ఆయనకు బీఆర్‌ఎస్ పార్టీ ఇచ్చిన గౌరవం, పదవులు ఏమిటో ఆయనకు ఆయన ప్రశ్నించుకోవాలని సూచించారు. కడియం శ్రీహరికి బీఆర్‌ఎస్ పార్టీ చేసిన అన్యాయం ఏంటి? ఆయన 2013లో వచ్చినప్పుడు కేసీఆర్ ఆయనను ఎంపీని చేశారని, ఆ తర్వాత డిప్యూటీ సీఎంను చేశారు.. ఆపై ఎమ్మెల్సీని చేశారు.
తర్వాత ఎమ్మెల్యేని చేశారని, ఆయన కూతురికి ఎంపీ టికెట్ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ వయసులో ఇలాంటి ‘మురికి‘ మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇంత సిగ్గులేకుండా ఎందుకు బతకాలి? మీరు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? నేను ఇంకా బీఆర్‌ఎస్‌లోనే ఉన్నాను, నాయకత్వంతోనే ఉన్నాను అని మీరు చెప్పారు. ఈ ‘థర్డ్ క్లాస్‘ మాటలు ఎందుకు? అని కేటీఆర్ ప్రశ్నించారు.




