28 June, 2026 | 5:34 PM

24,000 పాయింట్లపై నిఫ్టీ గురి

02-06-2024 12:05 AM

మోదీ హ్యాట్రిక్ అంటున్న ఎగ్జిట్ పోల్స్

మార్కెట్ టార్గెట్ పెంచిన విశ్లేషకులు

శనివారం సాయంత్రం వివిధ ఏజెన్సీలు, మీడియా సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్‌పోల్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడవ దఫా అధికారంలోకి రానున్నట్టు అంచనావేయడంతో స్టాక్ మార్కెట్ విశ్లేషకులు నిఫ్టీ టార్గెట్‌ను 24,000 పాయింట్లుగా నిర్దేశించారు. శుక్రవారం ఈ సూచి 22,500 పాయింట్లకు కాస్త ఎగువన నిలిచింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా జూన్ 4న లోక్‌సభ ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉంటే వచ్చే కొద్ది రోజుల్లో నిఫ్టీ 24,000 పాయింట్ల లక్ష్యాన్ని చేరుతుందని అనలిస్టులు ఢంకా భజాయిస్తున్నారు.

బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందంటూ ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. మెజారిటీ ఎగ్జిట్‌పోల్స్ ఎన్‌డీఏ కూటమికి 350 స్థానాలు లభించవచ్చని అంచనా వేశారు. ఇది 2019లో లభించిన స్థానాలకు దాదాపు సమానం. దీంతో ఈ సోమవారమే బుల్స్ మార్కెట్ పెద్ద ర్యాలీకి శ్రీకారం చుడతారని అనలిస్టులు చెపుతున్నారు. బీజేపీ సొంతంగా 290కిపైగా స్థానాలు పొందితే వెనువెంటనే మార్కెట్ ర్యాలీ చేస్తుందని బెర్న్‌స్టెయిన్ అనలిస్టులు అంచనా వేశారు. అయితే ఈ ఏడాది మొత్తానికి నిఫ్టీ రాబడి హై సింగిల్ డిజిట్, లో డబుల్ డిజిట్‌లో ఉంటుందని తెలిపారు. 

సీట్ల సంఖ్య ఆధారంగానే సంస్కరణలు

ఈ ఎన్నికల్లో బీజేపీ, దాని భాగస్వామలు పొందే సీట్ల సంఖ్య ఆధారంగానే మోదీ 3.0 ప్రధాన వ్యవస్థాగత సంస్కరణల్ని చేపట్టగలుగుతుందని బ్రోకరేజ్ సంస్థ షేర్‌ఖాన్ అంచనా వేసింది. ఎఫ్‌డీఐ పెట్టుబడులను ఆకర్షించాలన్నా, సావరిన్ రేటింగ్ పెంచుకోవాలన్నా, ప్రభుత్వ బాండ్లలోకి అధిక నిధుల్ని పొందాలన్నా వ్యాపార సరళీకరణ విషయంలో ప్రధాన సంస్కరణలు అవసరమని షేర్‌ఖాన్ తెలిపింది. బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడితే ఇన్‌ఫ్రా, ఇండస్టియల్స్, డిఫెన్స్, క్యాపిటల్ గూడ్స్, ఆటోమొబైల్స్ రంగాలు ప్రధానంగా లబ్దిపొందుతాయని అంచనా వేసింది. ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వస్తే వచ్చే రెండు వారాల్లో లార్జ్‌క్యాప్స్‌కంటే స్మాల్, మిడ్‌క్యాప్ షేర్లు జోరుగా పెరుగుతాయని షేర్‌ఖాన్ అంచనా వేసింది. పీఎస్‌యూ షేర్లు ఫోకస్‌లో ఉంటాయన్నది. అటుతర్వాత మార్కెట్ దృష్టి కేంద్ర బడ్జెట్‌వైపు మళ్లి పెరిగిన షేర్లలో లాభాల స్వీకరణ జరగవచ్చని తెలిపింది. ఇప్పటివరకూ వెనుకబడి ఉన్న ఫార్మా, ఎంఎఫ్‌ంసీజీ, ఐటీ రంగాలు అవుట్‌పెర్‌ఫార్మ్ చేస్తాయన్నది. 

ఈ రంగాల నేతృత్వం

రానున్న ర్యాలీకి ఫైనాన్షియల్స్, క్యాపిటల్ గూడ్స్, ఆటోమొబైల్స్, టెలికం రంగాల్లోని లార్జ్‌క్యాప్ షేర్లు నేతృత్వం వహిస్తాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ జీకే విజయ్‌కుమార్ అంచనా వేశారు. అంచనాల్ని మించి న జీడీపీ గణాంకాలు కూడా బుల్స్‌ను ఉత్సాహపరుస్తాయని చెప్పారు. టెక్నికల్‌గానూ, ఫండమెంటల్స్ పరంగా నూ ర్యాలీకి మార్కెట్ సిద్ధంగా ఉన్నదని తెలిపారు. గత కొద్ది రోజులుగా మార్కెట్లో నెలకొన్న ఒడిదుడుకులు సోమవారం తగ్గుతాయని, బీజేపీ స్వయంగా మెజారిటీ సాధిస్తుందా లేదా అన్న అంశంపై మార్కెట్ దృష్టిపెడతుందని, కొత్త సంస్కరణలతో ఆర్థిక విధానాలు కొనసాగుతాయన్న ధీమా ఇన్వెస్టర్లలో ఏర్పడుతుందని విశ్లేషకులు వివరించారు.