28 June, 2026 | 6:44 PM

ఆటోమొబైల్ అమ్మకాలు అంతంతే

02-06-2024 12:05 AM

న్యూఢిల్లీ, జూన్ 1: ఎన్నికల సీజన్‌కావడంతో డిమాండ్ సన్నగిల్లడం, గత ఏడాది బేస్ ఎక్కువగా ఉండటంతో ఈ ఏడాది మే నెలలో ఆటోమొబైల్ అమ్మకాలు మందకొడిగా సాగాయి. గత నెలలో వివిధ కార్ల కంపెనీల నుంచి డీలర్లకు 3,50,257 యూనిట్ల పాసింజర్ వాహనాలు సరఫరా అయ్యాయి. గత ఏడాది ఇదేనెలతో జరిగిన డిస్పాచ్‌లు 3,35,436 యూనిట్లతో పోలిస్తే 4 శాతం మాత్రమే వృద్ధి నమోదయ్యింది. పాసింజర్ వాహనాల మార్కెట్లో అగ్రసంస్థ అయిన మారుతి సుజుకి 2024 మే నెలలో స్వల్పంగా వృద్ధిచెంది 1,44,002 యూనిట్లకు చేరినట్టు శనివారం తెలిపింది. గత ఏడాది ఇదే నెలలో కంపెనీ 1,43,708 కార్లను విక్రయించింది. ఎంట్రీలెవెల్, కాంపాక్ట్ కార్ల అమ్మకాలు నిరుడుతో పోలిస్తే ఈ మే నెలలో తగ్గాయని కంపెనీ తెలిపింది. అయితే బ్రెజ్జా, గ్రాండ్ వితారా, ఎర్టిగా, ఎస్ క్రాస్, ఎక్స్‌ఎల్6లతో పాటు తమ యుటిలిటీ వాహన విక్రయాలు 46,243 యూనిట్ల నుంచి 54,204 యూనిట్లకు పెరిగాయన్నది. మే నెలలో మారుతి సుజుకి చిన్న కార్ల అమ్మకాలు 12,236 యూనిట్ల నుంచి 9,902 యూనిట్లకు తగ్గాయి. 

హయ్యర్ బేస్ ఎఫెక్ట్

 గత ఏడాది హయ్యర్ బేస్ ఎఫెక్ట్ కారణంగా ఈ సంవత్సరం వృద్ధి ఎక్కువగా ఉండ దని చెపుతూ వచ్చామని, అలాగే ఎన్నికలు జరుగుతుండటం, అధిక ఉష్ణోగ్రతలు కూడా మే నెల అమ్మకాలపై ప్రభావం చూపినట్టు మారుతి సుజుకి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ మీడియాకు తెలిపారు. ఎన్ని కల ఫలితాలు వెల్లడైన తర్వాత అమ్మకాలు జో రందుకుంటాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశా రు. మారుతి ప్రత్యర్థి హ్యుందాయ్ మోటార్ అమ్మకాలు కూడా మే నెలలో స్వల్పంగా 1 శాతమే పెరిగాయి. కంపెనీ హోల్‌సేల్ విక్రయాలు 48,601 యూనిట్ల నుంచి 49,151 యూనిట్లకు చేరాయి. టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాలతో సహా మే నెలలో విక్రయా లు 2 శాతం వృద్ధిచెంది 45,984 యూనిట్ల నుంచి 47,075 యూనిట్లకు పెరిగాయి. 

ఎం అండ్ ఎం టాపర్

మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాలు మాత్రం మే నెలలో భారీగా 31 శాతం వృద్ధిచెంది 43,218 యూనిట్లకు చేరాయి. గత ఏడాది మే నెలలో ఈ కంపెనీ 32,886 యూనిట్లను విక్రయించింది. టొయోటా కిర్లోస్కర్ అమ్మకాలు 24 శాతం వృద్ధిచెంది 25,273 యూనిట్లకు పెరిగాయి. తమ విక్రయాలు మే నెలలో 4 శాతం పెరిగి 18,766 యూనిట్ల నుంచి 19,500 యూనిట్లకు చేరినట్టు కియా ఇండియా తెలిపింది.  ఈ ఏడాది ఇప్పటివరకూ తమ మోడల్స్‌లో పలు కొత్త వేరియంట్లను ప్రవేశపెట్టామని, అవి తమ అమ్మకాలకు ఊతమిచ్చాయని కియా ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హర్‌దీప్ సింగ్ బ్రార్ తెలిపారు.  10 లక్షల దేశీయ అమ్మకాల మార్క్‌ను త్వరలో చేరతామని వెల్లడించారు. ఎంజీ మోటార్ ఇండియా అమ్మకాలు మే నెలలో 5 శాతం క్షీణించి 4,769 యూనిట్లకు తగ్గాయి.