జీఎస్టీ వసూళ్లు రూ.1.73 లక్షల కోట్లు
న్యూఢిల్లీ, జూన్ 1: దేశంలో జీఎస్టీ వసూళ్లు మే నెలలో నిరుడు ఇదే నెలతో పోలిస్తే 10 శాతం వృద్ధితో రూ. 1.73 లక్షల కోట్లకు పెరిగినట్టు శనివారం కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. అయితే ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జరిగిన రూ.2.10 లక్షల కోట్ల రికార్డు వసూళ్లతో పోలిస్తే మే నెలలో తగ్గాయి. మే నెలలో దిగుమతులు తగ్గినప్పటికీ, దేశీయ లావాదేవీల ద్వారా వచ్చిన ఆదాయం పెరగడంతో జీఎస్టీ వసూళ్లలో వృద్ధి సాధ్యపడిందని ఆర్థిక శాఖ వివరించింది. 2024 మే నెలలో రిఫండ్స్ తర్వాత నికర జీఎస్టీ ఆదాయం నిరుడు ఇదేనెలకంటే 6.9 శాతం వృద్ధిచెంది రూ.1.44 లక్షల కోట్లకు పెరిగాయి.
తెలంగాణలో 11 శాతం వృద్ధి
తెలంగాణ రాష్ట్రంలో మే నెలలో రూ.4,986 కోట్ల జీఎస్టీ వసూళ్లు జరిగాయి. గత ఏడాది ఇదే నెలలో నమోదైన రూ.4,507 కోట్లతో పోలిస్తే 2024 మేలో 11 శాతం వృద్ధిచెందాయి.






