బరాజ్‌ల్లో నిపుణుల క్షేత్రస్థాయి పరిశీలనలు
జయశంకర్ భూపాలపల్లి, జూన్ 1(విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అన్నా రం, మేడిగడ్డ బరాజ్‌ల్లో నిపుణుల బృందాలు క్షేత్రస్థాయి పరిశీలనలు చేస్తున్నారు. గత అక్టోబర్‌లో మేడిగడ్డ బరాజ్ పిల్లర్లు కుంగిపోవడం నుంచి మొదలు ఇటీవల 7వ బ్లాక్‌లో పనులు నడుస్తుండగా గొయ్యిలు ఏర్పడటం వరకు జరుగుతున్న పరిణామాలపై నిపుణుల బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలన చేస్తున్నారు. తాజాగా మేడిగడ్డ, అన్నారం బరాజ్‌లను ఎక్స్‌పర్ట్ కమిటీ ఆఫ్ జ్యుడీషియల్ కమిషన్ సభ్యులు పరిశీలించారు. బరాజ్‌లో కుంగిన బ్లాక్‌లో జరుగుతున్న రిపేర్లతో పాటు ఇసుక తొలగింపు, ఇతరత్ర పనులను పరిశీలించారు. పిల్లర్ల మధ్య ఏర్పడిన గ్యాప్‌ను ఎలా పూర్తిచేయాలో సూచించారు. ఈ బృందంలో ఎన్‌ఐటీ వరంగల్ ప్రొఫెసర్ రమణమూర్తి, ఓయూ ప్రొఫెసర్ రాజశేఖర్, మెకానికల్ అడ్వైజర్ రిటైర్డ్ ఈఎన్‌సీ ఈఆర్ సత్యనారాయణతో పాటు ఇంజినీరింగ్ అధికారులు ఉన్నారు.






