19 July, 2026 | 2:49 AM

పటాకుల ఫ్యాక్టరీలో పేలుడు

19-07-2026 12:48 AM
  1.  9 మంది దుర్మరణం
  2.  15 మందికి తీవ్ర గాయాలు
  3. గుజరాత్‌లోని మహమ్మదిపూరాలో ఘటన

గాంధీనగర్, జూలై 18: గుజరాత్ అహ్మాదాబాద్‌లోని ఓ పటాకుల కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ౯ మంది మృతి చెందగా, 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. శనివారం ఉదయం వస్త్రాల్ మహమ్మది పూరా అనే ప్రాంతంలో ‘టాలెంట్ బాణాసంచా’లో పేలుడు చోటు చేసుకుంది. ఈ ప్రాంతానికి దగ్గరలోనే ఆర్‌ఏఎఫ్ సైనిక శిబిరం ఉండడంతో వెంటనే జవాన్లు సహాయక చర్యలకు రంగంలోకి దిగారు.

అనంతరం సమాచారం అందుకున్న అగ్నిమాపకశాఖాధికారులు ఫైరింజన్ల సహాయంతో మంటలను ఆర్పివేశారు. పేలుడు జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 25 మంది వరకు పనిచేస్తున్నట్లు సమాచారం. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో చేర్చారు. పేలుడు శబ్దాలు 5కి.మీ. వరకు వినిపించాయని, స్థానికులు తెలిపారు. ఫ్యాక్టరీని అక్రమంగా నడుపుతున్నారని, పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపించారు.

ఈ ప్రమాదంపై జాయింట్ పోలీస్ కమిషనర్ జైపాల్ సింగ్ రాథోడ్ మీడియాతో మాట్లాడుతూ.. ఖాళీ స్థలంలో పటాకుల ఫ్యాక్టరీని అక్రమంగా మెహుల్ దోడియా అనే వ్యక్తి నడుపుతున్నారని చెప్పారు. ఈ ఫ్యాక్టరీకి లైసెన్సు లేదన్నారు. గాయపడిన వారిని స్థానికంగా ఉన్న ఎల్జీ, అసర్వా సివిల్ ఆసుపత్రుల్లో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు రాథోడ్ తెలిపారు.

ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ, గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలందించాలన్నారు. మృతుల కుటుంబాలకు కేంద్రం తరఫున ఒక్కొక్కరికి రూ. 2 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు.