వణికిన మెక్సికో
- పసిఫిక్ తీరంలో భూకంపం
- రిక్టార్ స్కేల్‌పై 7.3 తీవ్రత
- సునామీ హెచ్చరికలు జారీ
మెక్సికో, జూలై 18: మెక్సికో, గ్వాటెమాల సరిహద్దు పసిఫిక్ తీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 7.3గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం వచ్చిన ఈ భూకంపంతో అమెరికాలో తీవ్ర భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. మెక్సికోతోపాటు గ్వాటెమాల, ఎల్ సాల్వడార్ ప్రాంతాల్లోనూ భూకంపం సంభవించింది. అమెరికా జియోలాజికల్ సర్వే అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
భూకంప కేంద్రం ఆక్విలెస్ సెర్డాన్ ప్రాంతానికి నైరుతి దిశగా సముద్రంలో 48 కి.మీ. దూరం, భూమి లోపల 15 కి.మీ. లోతులో ఉన్నట్లు గుర్తించారు. భారీ భూకంపం తరువాత కూడా స్వల్పస్థాయిలో పలుమార్లు భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. అధికారుల సునామీ, భూకంపం హెచ్చరికలు తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తమై అక్కడి నుంచి తరలివెళ్లారు.
మరోవైపు బీచ్ ప్రాంతాల్లో ఉన్న పర్యాటకులు, పర్యావరణ ఔత్సాహికులు ఆ ప్రాంతాలను ఖాళీ చేశారు. గ్వాటెమాల ప్రాంతంలో వచ్చిన భూకంపంతో ఇళ్లలోని ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు. భారీ భవంతులు ఊగిసలాటకు గురయ్యాయి.






