సెల్ఫీ దిగి సీఎంకు పంపిన హరీశ్ రావు
ఉమ్మడి మెదక్ జిల్లాపై రేవంత్ రెడ్డి పగబట్టారు
మెదక్: నర్సాపూర్ నియోజకవర్గంలో(Narsapur Constituency) హరీశ్ రావు పర్యటించారు. రెడ్డిపల్లి, మంతూరు గ్రామ శివారులో ఆగిపోయిన కాళేశ్వరం కాలువ పనులను హరీశ్ రావు పరిశీలించారు. కాలువ పనుల దగ్గర సెల్ఫీ దిగిన హరీశ్ రావు(Harish Rao selfie) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) పంపించారు. ఉమ్మడి మెదక్ జిల్లాపై రేవంత్ రెడ్డి పగబట్టారని హరీశ్ రావు ఆరోపించారు. మూడేళ్లుగా కాళేశ్వరం కాలువ పనులు నిలిచిపోయాయని విమర్శించారు. కాళేశ్వరం కాలువల(Kaleshwaram canals) పనులకు తక్షణమే నిధులివ్వాలని డిమాండ్ చేశారు.
'ముఖ్యమంత్రి గారూ... నీళ్లు పారాల్సిన కాలువల్లో తుమ్మ చెట్లు మొలిచాయి. కేసీఆర్ హయాంలో పరుగులు పెట్టిన ప్రాజెక్టులు మీ నిర్లక్ష్యానికి ఇలా పడావు పడ్డాయి. నర్సాపూర్ రెడ్డిపల్లి వద్ద ఆగిపోయిన కాలువ పనుల దగ్గర నేను దిగిన ఈ సెల్ఫీనే.. మీ చేతకాని పాలనకు సజీవ సాక్ష్యం. ఉమ్మడి మెదక్ జిల్లా రైతులంటే మీకెందుకంత కక్ష? ప్రాజెక్టులను గాలికి వదిలేసి రైతుల నోట్లో మట్టికొట్టొద్దు. వెంటనే నిధులు ఇచ్చి పనులు మొదలుపెట్టకపోతే రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం.' అని హరీశ్ రావు ఎక్స్ లో పోస్టు చేశారు.
రేవంత్ ప్రభుత్వానికి హరీశ్ రావు డిమాండ్లు..
సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టుల పనులు తక్షణమే ప్రారంభించాలి.
ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంపు పనులను వెంటనే పూర్తి చేయాలి.
మల్లన్న సాగర్ నుంచి నర్సాపూర్, ఆందోల్ కు నీళ్లు తీసుకొచ్చే కాళేశ్వరం కాలువ పనులు పూర్తి చేయాలి.
జిల్లాలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణకు వెంటనే నిధులు విడుదల చేయాలి.






