21 August, 2026 | 9:05 PM

మణుగూరు అనాథ బాలికల శరణాలయంలో మెరుగైన సౌకర్యాలు

21-08-2026 06:23 PM

మణుగూరు,(విజయక్రాంతి): మణుగూరులోని బాలికల అనాథ శరణాలయంలో చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలను తక్షణమే ఏర్పాటు చేసినట్లు భద్రాచలం సబ్‌ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట తెలిపారు. ఈ నెల 20న శరణాలయాన్ని సబ్‌ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బాలికలకు సరిపడా డైనింగ్ టేబుల్స్, కుర్చీలు లేవని, శరణాలయంలో మరికొన్ని ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు అవసరమని గుర్తించారు. వెంటనే స్పందించిన ఆయన, అవసరమైన సౌకర్యాలను అదే రోజు సాయంత్రానికల్లా ఏర్పాటు చేయాలని మణుగూరు తహసీల్దార్ అద్దంకి నరేష్‌ను ఆదేశించారు. 

అదేవిధంగా చిన్నారుల ఇష్టానుసారం ప్రత్యేక విందు ఏర్పాటు చేయాలని కూడా సూచించారు. సబ్‌ కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ నరేష్, ఆయన బృందం తక్షణమే చర్యలు చేపట్టి అవసరమైన డైనింగ్ టేబుల్స్, కుర్చీలు, ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లను ఏర్పాటు చేయడంతో పాటు అదే రోజు పిల్లలకు ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించడంలో తహసీల్దార్ నరేష్, ఆయన బృందం చూపిన అంకితభావం, తక్షణ స్పందన, వేగవంతమైన చర్యలను సబ్‌ కలెక్టర్ అభినందించారు.

డివిజన్ పరిధిలోని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, గురుకులాలు, కళాశాలలు, హాస్టళ్లు, ఇతర ప్రభుత్వ సంస్థల్లో చిన్నవిగా కనిపించినప్పటికీ పిల్లలు, విద్యార్థుల సంక్షేమానికి సంబంధించిన ముఖ్యమైన సమస్యలను అధికారులు గుర్తించి వెంటనే పరిష్కరించాలని సబ్‌ కలెక్టర్ సూచించారు. సకాలంలో జోక్యం చేసుకుని బాధ్యతాయుతంగా పనిచేసే యంత్రాంగం ద్వారా పిల్లలు, విద్యార్థుల సంక్షేమంతో పాటు వారికి అందుతున్న వసతుల్లో గణనీయమైన మార్పు తీసుకురావచ్చని మృనాల్ శ్రేష్ట తెలిపారు .