సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ సీనియర్ నాయకుడు బత్తిని సత్యం మృతి
సత్యన్న మృతి పార్టీకి తీరనిలోటు
సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అవునూరి మధు
ఆళ్ళపల్లి, (విజయక్రాంతి): మండల కేంద్రానికి చెందిన సిపిఐ (ఎం-ఎల్)న్యూ డెమోక్రసీ ఇల్లెందు డివిజన్ కమిటీ సభ్యులు బత్తిని సత్యన్న గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ గురువారం రాత్రి మృతి చెందారు. శుక్రవారం బత్తిని సత్యన్న భౌతిక కాయం పై సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఆవునూరి మధు, ఖమ్మం జిల్లా కార్యదర్శి బండారి ఐలయ్య, ఇల్లందు డివిజన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి బట్టు ప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సంతాప కార్యక్రమంలో వారు,మాట్లాడారు.నిత్యం ప్రజల కోసం,ప్రజా సమస్యల పరిష్కారం కోసం సత్యన్న అలుపెరగని కృషి చేశారని అన్నారు. ఎంతో క్రమశిక్షణగా పట్టుదలగా తుది శ్వాస విడిచే వరకు విప్లవోద్యమంలో పనిచేశారని అన్నారు.ఆయన మరణం న్యూ డెమోక్రసీ పార్టీకి తీరని లోటన్నారు. సత్యన్న ఆశయాల సాధన కొరకు పోరాడాలని పిలుపునిచ్చారు.
సత్యన్న మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. సిపిఐ జిల్లా నాయకులు రేసు ఎల్లయ్య మాట్లాడుతూ కామ్రేడ్ బత్తిని సత్యన్న మరణం ఆళ్లపల్లి మండలంలో కమ్యూనిస్టు పార్టీకి తీరనిలోటు అన్నారు. ముందుగా కామ్రేడ్ సత్యన్నను స్మరించుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటించి జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో గుండాల మాజీ ఎంపీపీ ముక్తి సత్యం,కాచనపల్లి సర్పంచ్ జరుపుల కిషన్, న్యూడెమోక్రసీ, ప్రజాసంఘాల నాయకులు గౌని నాగేశ్వరరావు,జె. సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.






