ఫడ్నవీస్‌కు పట్టాభిషేకం
దేవేంద్ర సరితా గంగాధర్‌రావు ఫడ్నవీస్ అనే నేను..
- మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం
- ప్రమాణం చేయించిన గవర్నర్ సీపీ రాధాకృష్ణన్
- డిప్యూటీ సీఎంలుగా షిండే, అజిత్ పవార్
- ముంబైలోని ఆజాద్‌మైదాన్ వేదికగా కార్యక్రమం
- ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్, నడ్డా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తదితరులు హాజరు
ఆధునిక అభిమన్యుడు!
నేను ఆధునిక అభిమన్యుడిని.. చక్రవ్యూహాన్ని ఛేదించడం, విజయం సాధించడం తెలిసినవాడిని.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్
* ‘నేను సముద్రం అలలవంటి వాడిని.. మళ్లీ తిరిగొస్తాను’ అని గతంలో చేసిన వ్యాఖ్యలను దేవేంద్ర ఫడ్నవీస్ నిజంచేశారు. దేవేంద్ర సరితా గంగాధర్‌రావు ఫడ్నవీస్ అను నేను అంటూ.. మహారాష్ట్ర 18వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దక్షిణ ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో గురువారం సాయంత్రం అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్‌తో ప్రమాణం చేయించారు. దీంతో ఫడ్నవీస్ ముచ్చటగా మూడోసారి మహారాష్ట్ర సీఎంగా పగ్గాలు చేపట్టారు.
ముంబై, డిసెంబర్ 5: మహారాష్ట్రలో అఖండ విజయంతో అధికారంలోకి వచ్చి మహాయుతి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు కదిలింది. గురువారం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణం చేయగా, శివసేన అధినేత ఏక్‌నాథ్ షిండే, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్‌లు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ హాజరయ్యారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమ్రంతి చంద్రబాబు నాయుడు, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ సహా ఎన్డీయే కూటమికి సంబంధించిన 20 మంది ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఫడ్నవీస్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రమాణ స్వీకారోత్సవం నేపథ్యంలో పోలీసులు ముంబైలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఐదుగురు అదనపు కమిషనర్లు, 15 మంది డీసీపీలు, దాదాపు 700 ఇతర అధికారులతోపాటు 4000 మందికిపైగా భద్రతా సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు. సుమారు 8వేల సీసీ కెమెరాలను ఏర్పాట్లు చేసి భద్రతను పర్యవేక్షించారు.
కార్యక్రమానికి సుమారు 40వేల మంది మహాయుతి మద్దతుదారులు వస్తారని అంచనా వేసి అధికారులు అందుకు దగ్గ ఏర్పాట్లు చేశారు. అయితే అధికారులు అంచనా వేసినదానికంటే ఎక్కువ మంది ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆజాద్ మైదానంలో పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో వాహనాదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.
హాజరైన సినీ, వ్యాపార ప్రముఖులు
ఆజాద్ మైదాన్ వేదికగా జరిగిన కార్యక్రమానికి బాలీవుడ్ కథానాయుకుడు సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్, రణబీర్ సింగ్, షారుఖ్ ఖాన్ తదితరలు హాజరయ్యారు. అలాగే మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ, ఆయన తనయుడు అనంత్ అంబానీ, గౌతమ్ అదానీ, ఆదిత్య బిర్లా గ్రూప్స్ చైర్మన్ కుమార మంగళం బిర్లాతోపాటు ఆయన కూతురు కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చారు.
పొలిటికల్ చేంజ్ చూస్తారు
మహారాష్ట్ర ప్రజలు తన పాలనలో రాజకీయ మార్పును చూస్తారు తప్ప ప్రతీకారం కాదని దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన రానున్న ఐదేళ్లలో సుస్థిర పాలన అందిస్తామన్నారు. సామాజిక, మౌలిక, పారిశ్రామిక రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని స్పష్టం చేశారు. కాగా, పూణేకు చెందిన వ్యక్తి బోన్‌మ్యారో చికిత్స కోసం అవసరమైన డబ్బులు మంజూరు చేస్తూ తొలి సంతకం చేశారు.
ఎర్రబారిన ప్రముఖుల ముఖాలు
ప్రమాణ స్వీకారం వేళ ఏక్‌నాథ్ షిండే వైఖరి ప్రముఖలకు ఆగ్రహాన్ని తెప్పించింది. రాజ్యాంగం ప్రకారం ఏక్‌నాథ్ షిండే అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల అంటూ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా ఆయన అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. ఏక్‌నాథ్ షిండే శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రేను హిం దూ హృదయ సామ్రాట్ అంటూ.. ప్రమాణం చేయబోయారు.
ఆధునిక అభిమన్యుడు
దేవేంద్ర ఫడ్నవీస్ సంఘ్‌తో అనుబంధం ఉన్న కుటుంబంలో జన్మించారు. విద్యార్థి దశలో ఏబీవీపీ లీడర్‌గా పనిచేశారు. ఈ క్రమంలోనే ఆయన 22ఏళ్లకే కార్పొరేటర్ అయ్యారు. ఆ తర్వాత 5 సంవత్సరాలకు నాగ్‌పూర్ నగర పాలక సంస్థలో మేయర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో నాగపూర్ చరిత్రలోనే నాగ్‌పూర్ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన పిన్న వయస్కుడిగా ఫడ్నవీస్ గుర్తింపు పొందారు.
39ఏళ్ల వయసులో మొదటి సారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన ఆ తర్వాత ఐదేళ్లకే తొలిసారిగా 2014లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలోనే రాష్ట్ర చరిత్రలోనే అతి పిన్న వయసులో సీఎం పగ్గాలు చేపట్టిన రెండో వ్యక్తిగా గర్తింపు పొందారు. 2019లో ఎన్నికల్లో బీజేపీ కలిసి పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో ఈ కూటమి ఘన విజయం సాధించింది.
అయితే, అప్పటి శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబట్టారు. దీంతో ఫడ్నవీస్ హడావిడిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఫడ్నవీస్ ఐదురోజులు మాత్రమే ఆ పదవిలో కొనసాగారు. కాంగ్రెస్‌తో ఉద్ధవ్ ఠాక్రే జత కట్టడంతో ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
ఉద్ధవ్ ఠాక్రే తన నుంచి సీఎం పీఠాన్ని లాక్కున్న తర్వాత ఫడ్నవీస్ పలుమార్లు ఆయనను సవాల్ చేశారు. “నేను సముద్రం లాంటి వాడిని.. మళ్లీ తిరిగొస్తాను” అంటూ శపథం చేశారు. శివసేనలో చీలిక రావడంతో 2022లో తిరిగి సీఎం పీఠం మహయుతికి దక్కింది. ఆ సమయంలో ఫడ్నవీస్ పట్టుబట్టు ఉంటే ఆయనకు రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశం దక్కేది. కానీ ఫడ్నవీస్ అలా చేయలేదు.
అప్పటి రాష్ట్ర రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకుని వెనక్కి తగ్గారు. ఏక్‌నాథ్ షిండే మహారాష్ట్ర సీఎంగా పగ్గాలు చేపడితే ఆయన మంత్రి వర్గంలో ఫడ్నవీస్ తన స్థాయిని తగ్గించుకుని డిప్యూటీ సీఎంగా పని చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా వైఫల్యం చెందడంతో ఫడ్నవీస్ తన డిప్యూటీ సీఎం పదవిని కూడా వదులుకుని పార్టీని బలోపేతం కృషి చేయాలని భావించారు.
కానీ అగ్రనేతల సూచనతో డిప్యూటీ సీఎంగా పని చేస్తూనే రాష్ట్రంలో పార్టీని పటిష్ట పరిచారు. 2022లో ఫడ్నవీస్ మహాయుతి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఉద్ధవ్ వర్గం నేతలు ఆయనను పదేపదే వెక్కిరించారు. అయితే ఆయన అవేమీ పట్టించుకోలేదు.
“నేను ఆధునిక అభిమన్యుడిని.. చక్రవ్యూహాన్ని ఛేదించడం, విజయం సాధించడం తెలిసినవాడిని” అంటూ ఎన్నికల ప్రచారంలో పదే పదే పేర్కొన్న ఫడ్నవీస్.. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ఘన విజయం కట్టబెట్టారు. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా మహాయుతిలోని బీజేపీ ఒక్కటే ఏకంగా 132 స్థానాల్లో విజయం సాధించింది. ఈ క్రమంలోనే మహాయుతి కూటమి నేత ఏక్‌నాథ్ షిండే సీఎం పదవిని మరోసారి ఆశించినప్పటికీ బీజేపీ మాత్రం ఫడ్నవీస్ పేరునే ఖరారు చేసింది.






