ఏజెన్సీలో నకిలీ విత్తనాల మాఫియా!
- అమాయక గిరిజన రైతులే లక్ష్యం
- అధిక దిగుబడుల పేరుతో భారీ మోసం
- ఈ ఏడాది మూడు కేసులు
- 9 మంది అరెస్ట్.. 8.70 క్వింటాళ్ల నకిలీ విత్తనాల స్వాధీనం
కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 22 (విజయక్రాంతి): ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో ఏజెన్సీ ప్రాంతంలో నకిలీ పత్తి విత్తనాల మాఫియా మళ్లీ చురుగ్గా మారింది. అధిక దిగుబడులు వస్తాయంటూ ఆశలు కల్పిస్తూ అమాయక గిరిజన రైతులను లక్ష్యంగా చేసుకుని దళారులు నకిలీ విత్తనాలను విక్రయిస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా పొరుగు ప్రాంతాల నుంచి నకిలీ విత్తనాలను రహస్యంగా జిల్లాకు తరలించి గ్రామీణ ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు సమాచారం.
జిల్లాలో పత్తి ప్రధాన వాణిజ్య పంట కావడంతో అక్రమార్కులకు ఇది లాభదాయక వ్యాపారంగా మారింది. గ్రామాల్లో స్థానిక దళారులను నియమించుకుని రైతుల వద్దకు నేరుగా చేరుతున్న ముఠాలు, ఈ విత్తనాలతో అధిక దిగుబడి వస్తుంది, మార్కెట్లో దొరకని ప్రత్యేక రకం అంటూ నమ్మబలికి రైతులను మోసగిస్తున్నారు. ముఖ్యంగా అవగాహన తక్కువగా ఉన్న గిరిజన రైతులే వీరి ప్రధాన లక్ష్యంగా మారుతున్నారు.
వరుసగా బయటపడుతున్న కేసులు
జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు నకిలీ పత్తి విత్తనాలకు సంబంధించి మూడు కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. ఈ కేసుల్లో మొత్తం 9 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తనిఖీల్లో 8.70 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా సిర్పూర్ (యు) మండలంలోనే 5.45 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు పట్టుబడడం అక్రమ వ్యాపారం ఎంత విస్తృతంగా సాగుతోందో తెలియజేస్తోంది.
డీలర్ల పాత్రపై అనుమానాలు
నకిలీ విత్తనాల విక్రయాల వెనుక కొంతమంది లైసెన్స్ కలిగిన డీలర్ల ప్రమేయం కూడా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారిక విక్రయ వ్యవస్థ ను అడ్డుగా పెట్టుకుని అక్రమ వ్యాపారులు తమ నెట్వర్క్ను విస్తరిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై వ్యవసాయ శాఖ, పోలీసు శాఖలు మరింత లోతుగా విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని రైతు సంఘాలు కోరుతున్నాయి.
అవగాహన లోపమే అక్రమార్కులకు అవకాశం
నకిలీ విత్తనాలపై పోలీసు, వ్యవసాయ శాఖలు తరచూ హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు తగిన స్థాయిలో అవగాహన కల్పించడంలో లోపాలు ఉన్నాయని విమర్శలు ఉన్నాయి. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని అక్రమార్కులు రైతులను మోసం చేస్తున్నారని స్థానికులు అంటున్నారు.
రైతులు అప్రమత్తంగా ఉండాలి
నకిలీ విత్తనాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. విత్తనాలు కొనుగోలు చేసే ముందు ప్యాక్పె కంపెనీ పేరు, లాట్ నంబర్, క్యూఆర్ కోడ్, హోలోగ్రామ్ వంటి గుర్తులను తప్పనిసరిగా పరిశీలించాలని సూచిస్తున్నారు. కేవలం లైసెన్స్ పొందిన విక్రయ కేంద్రాల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలని చెబుతున్నారు.
సమాచారం ఇస్తే వెంటనే చర్యలు
నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్నట్లు తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించాలి. నకిలీ విత్తనాల సరఫరాపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, రైతుల ప్రయోజనాల కోసం కఠిన చర్యలు తీసుకుంటం. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి సమాచారాన్ని అందిస్తే అక్రమ వ్యాపారాన్ని పూర్తిగా అరికట్టవచ్చని పేర్కొన్నారు.
నితికా పంత్, జిల్లా ఎస్పీ






