ఆమనగల్ ‘అక్రమ’ మార్కెట్‌పై నజర్!
- దళారుల చేతిలో చిక్కుకున్న అన్నదాత.. పన్నులెగ్గొడుతూ లక్షలు గడిస్తున్న ఏజెంట్లు
- నిబంధనలు ఉల్లంఘిస్తే జైలు శిక్షే.. రంగంలోకి దిగిన మార్కెట్ కమిటీ కార్యదర్శి
- 7 రోజుల్లోగా లైసెన్స్ తీసుకోకుంటే దుకాణాలు సీజ్
ఆమనగల్లు,మే22 (విజయక్రాంతి): అత్యాశకు అలవాటు పడిన కొందరు దళా రులు.. అమాయక రైతుల శ్రమను దోచుకుంటూ, ప్రభుత్వ ఖజానాకు కన్నం వేస్తున్న ఉదంతం ఆమనగల్ మండల కేంద్రంలో కలకలం రేపుతోంది. గత కొన్ని ఏళ్లుగా ఎలాంటి ప్రభుత్వ అనుమతులు, లైసెన్సులు లేకుండానే ఇక్కడ ఒక ‘సమాంతర’ అక్రమ మార్కెట్ నడుస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం ప్రభు త్వానికి చెల్లించాల్సిన ఫీజులను ఎగ్గొడుతూ.. కొందరు ఏజెంట్లు సొమ్ము చేసుకుంటున్నారు.
ఈ దోపిడీపై ఎట్టకేలకు ఆమనగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉక్కుపాదం మోపింది. అక్రమ వ్యాపారాల గుట్టు రట్టు చేస్తూ.. మార్కెట్ కమిటీ కార్యదర్శి సంచలన నోటీసులు జారీ చేశారు. సాధారణంగా రైతులు పండించిన పంటను మార్కెట్ యార్డుకు తీసుకువచ్చి, ప్రభుత్వ పర్యవేక్షణలో మద్దతు ధరకు అమ్ముకోవాలి. కానీ, ఆమనగల్లోని కొన్ని ప్రైవేట్ కార్యాలయాలు, ఏజెంట్లు రోడ్ల పక్కనే, దుకాణాలు ఏర్పాటు చేసి ఎలాంటి లైసెన్సులు లేకుండానే క్రయవిక్రయాలు జరుపుతున్నారు.
రైతులకు తూకాల్లో మోసం..
లైసెన్స్ లేని ఈ అక్రమ వ్యాపారులను నిలదీసే నాథుడు లేకపోవడంతో, తూకాలలో మరియు ధరలలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందనే విమర్శలు ఉన్నాయి. చట్టప్రకారం మార్కెట్ కమిటీకి చెల్లించాల్సిన ‘మార్కెట్ ఫీజు’ను పూర్తిగా ఎగ్గొడుతుండటంతో ప్రభుత్వ ఆదాయానికి ప్రతి ఏటా కోట్లాది రూపాయల గండి పడుతోంది. ఈ అక్రమ దందాపై పూర్తి నివేదిక సిద్ధం చేసిన ఆమనగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ, నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఎజెంట్లు, కార్యాలయ నిర్వాహకులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ వ్యవసాయోత్పత్తులు మరియు పశుగణముల మార్కెట్ల చట్టం, 1966 లోని సెక్షన్ 7(1) ప్రకారం ప్రతి వ్యాపారి మార్కెట్ కమిటీ అనుమతి పొందడం తప్పనిసరి. దీన్ని ఉల్లంఘిస్తే సెక్షన్ 23(1) ప్రకారం ఒక సంవత్సరం కారాగార శిక్ష మరియు రూ. 5,000 జరిమానా విధించేందుకు చట్టం అనుమతిస్తోంది.‘ అని అధికారులు స్పష్టం చేశారు.
గడువు 7 రోజులే..
ఆమనగల్ మార్కెట్ పాలకవర్గం తో పాటు మార్కెట్ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి ఆమనగల్ పట్టణంలో పలు కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఎంతమందికి లైసెన్సులు ఉన్నాయి, ఎంతమందికి లేవు అని వివరాలు సేకరించి ఏజెంట్లకు పలు నియమ, నిబందనలు వివరించారు.మార్కెట్ లో నోటీసులు అందిన 7 రోజులలోపు అక్రమ ఏజెంట్లు అందరూ తక్షణమే లైసెన్స్ ఫీజు చెల్లించి, చట్టబద్ధంగా అనుమతులు పొందాలని మార్కెట్ కమిటీ గడువు విధించింది.
ఈ గడువు ముగిసిన తర్వాత కూడా లైసెన్స్ లేకుండా వ్యాపారాలు సాగిస్తే సదరు కార్యాలయాలను, గోదాములను వెంటనే సీజ్ చేస్తారు.అక్రమంగా నిల్వ ఉంచిన వ్యవసాయోత్పత్తులను జప్తు చేస్తారు.నిర్వాహకులపై పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు.ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ, పన్నులు ఎగ్గొడుతున్న ‘పెద్దల’పై ఆమనగల్ మార్కెట్ కమిటీ తీసుకుంటున్న ఈ చర్యలను స్థానిక రైతులు, మేధావులు స్వాగతిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు నిరంతర నిఘా ఉంచి, ఆమనగల్ మండలంలో దళారుల దోపిడీకి శాశ్వతంగా అడ్డుకట్ట వేయాలని అన్నదాతలు కోరుతున్నారు.






