18 May, 2026 | 2:04 AM

కొనుగోలు కేంద్రంలో ఆగిన రైతు గుండె

18-05-2026 01:26 AM
  1. వరంగల్ జిల్లా అలంకానిపేటలో ఘటన
  2. నెల రోజులుగా కేంద్రంలోనే పడిగాపులు
  3. ఆరోగ్యం క్షీణించి, గుండెపోటు!

వరంగల్, (మహబూబాబాద్), మే 17 (విజయక్రాంతి): ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని విక్రయిం చేందుకు వచ్చి, రోజుల తరబడి నిరీక్షిస్తూ, ఆరోగ్యం దెబ్బతిని గుండె పోటుకు గురై ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే అన్నదాత కన్నుమూసిన ఘటన వరంగల్ జిల్లా నెక్కొండ మం డలం అలంకానిపేటలో ఆదివారం జరిగింది. అదే గ్రామానికి చెందిన గాజుల పెద్ద వెంకటేశ్వర్లు (63) అనే రైతు ధాన్యాన్ని విక్రయించడానికి తీసుకువచ్చి కొనుగోలు కేంద్రంలో కొద్ది రోజులుగా నిరీక్షిస్తున్నాడు.

ఈ క్రమం లో ఆదివారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో గుండెపోటుకు గురై ధాన్యం కొనుగోలు కేంద్రంలోని పడిపోగా అతనికి తోటి రైతులు, స్థానిక ఆర్‌ఎంపీ సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. తమ కళ్లెదుటే తోటి రైతు కన్నుమూసిన ఘటనతో రైతుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. నెల రోజులైనా కొనుగోలు చేయకపోవడం వల్లే రైతు మరణానికి కారణమైందని ఆరోపిస్తున్నారు. బాధిత రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.