కొడంగల్ అంబేద్కర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి నిరసన
ధర్మేంద్ర ప్రధాన్ ను బర్తరఫ్ చేయాలి
రాహుల్, ప్రియాంకపై కేంద్ర దాడికి నిరసనగా ఆందోళన
కొడంగల్: ఢిల్లీలో రాహుల్ గాంధీ(Rahul Gandhi arrest), ప్రియాంక గాంధీ, విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth rally) కొడంగల్ అంబేద్కర్ చౌరస్తాలో నిరసన చేపట్టారు. లక్షలాది విద్యార్థుల జీవితాలతో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్(Union Minister Dharmendra Pradhan) చెలగాటం ఆడారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్ ప్రశ్నాపత్రాలను(NEET question papers) పల్లీబటానీల్లా కోట్ల రూపాయాలకు అమ్ముకున్నారని ఆరోపించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోప్రశ్నాపత్రాలను అమ్ముకుంటున్నారని విమర్శించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఢిల్లీలో యువత ఆందోళన చేపట్టిందని గుర్తుచేశారు.
రాజకీయ పార్టీలకతీతంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రజా ఆందోళనలు పరిగణలోకి తీసుకుని ధర్మేంద్ర ప్రధాన్ ను బర్తరఫ్ చేయాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు. నీట్ ప్రశ్నాపత్రాలు అమ్ముకున్న వారిని అరెస్టు చేసి జైలులో పెట్టాలని కోరారు. ఢిల్లీలో లాఠీచార్జ్ లు, బాష్ప వాయువుతో విద్యార్థులపై పాశవిక దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడుల్లో గాయపడి వందలాది మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు, పదుల సంఖ్యలో విద్యార్థులు మాయమయ్యారని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఎత్తుకెళ్లారా.. బీజేపీ నేతలు కిడ్నాప్ చేశారా తెలియని పరిస్థితి ఉందన్నారు.






