22 July, 2026 | 2:03 PM

Breaking News

సర్కారు దవాఖానాలో డాక్టర్ సారు లేరు.. వైద్యమందక జనం విలవిల

22-07-2026 01:00 PM

బోథ్, జులై 22(విజయక్రాంతి): నూతనంగా ఏర్పడిన సోనాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో(Sonala Mandal Government Hospital) డాక్టర్ లేక వైద్యమందక మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మారుమూల గ్రామాల నుండి వైద్యం కోసం వచ్చిన పేదలకు సర్కారు ఆసుపత్రిలో వైద్య సేవలు అందించే డాక్టర్ లేక ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. 

డిప్యూటేషన్ పై డాక్టర్ 

అత్యధికంగా గిరిజనులు ఇతర వర్గాలకు చెందిన ప్రజలు ప్రతిరోజు ఆసుపత్రికి వైద్యం కోసం దాదాపు 200 మంది వరకు వస్తుంటారు. అయితే వైద్యం కోసం వచ్చిన వారికి ఇక్కడ డాక్టర్ లేకపోవడంతో ప్రైవేట్ ఆర్ఎంపీ వైద్యులను ఆశ్రయించాల్సి వస్తుందని వాపోతున్నారు. గతంలో తునాలలో ఉన్న డాక్టర్ నవీన్ రెడ్డిని బజారత్నూర్ మండలానికి మంగళవారం, శుక్రవారం డిప్యూటేషన్ పై పంపించేవారు. అయితే సోమవారం నుండి డాక్టర్ ను మారుమూలన ఉన్న బజార్హత్నూర్ మండలానికి రెగ్యులర్ డిప్యూటేషన్ పైన పంపించడంతో వైద్యం పేదలకు అందని ద్రాక్షగా మారింది.

అసలే వర్షాకాలం వ్యాధుల సీజన్

అసలే వర్షాకాలం మారుమూల గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలే ఆస్కారం ఉంది. అయితే ఇదే కాలంలో డాక్టర్ను డిప్యూటేషన్ పై పంపడంతో స్థానికంగా వైద్యం అందదని మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. డిప్యూటేషన్ పై పంపించిన డాక్టర్ను తిరిగి సొనాలకి పంపించాలని డిమాండ్ చేస్తున్నారు. స్థానిక రాజకీయ నాయకులు డాక్టర్ను నియమించాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు.