చుట్టం చూపుగా విధులకు..!
సమయపాలన పాటించడం లేదని వ్యవసాయ అధికారినిపై రైతుల ఆరోపణలు
రైతులకు అందుబాటులోనే ఉంటున్న: యమున దుర్గ
భీమిని, ఏప్రిల్ 9: ప్రతిరోజు చుట్టం చూపుల విధులకు హాజరు అవుతూ.. రైతుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని భీమిని మండల వ్యవసాయ అధికారిపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయంలో విధులు నిర్వహించే వ్యవసాయ అధికారిని యమున దుర్గ విధులకు గైర్హాజరవుతూ తన సొంత పనులను చక్కదిద్దుకుం టుందని రైతులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.
గురువారం మండల కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయానికి ఉదయం వచ్చి మధ్యాహ్నమే వెళ్లిపోయారు. దీంతో కార్యాలయానికి వచ్చిన కొందరు రైతులు ఖాళీ కుర్చీ దర్శనమివ్వడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. కార్యాలయం తాళాలను ఓ ప్రైవేటు వ్యక్తి వద్ద ఉంచుతూ సాయంత్రం కాగానే ఫోన్ లో అతనికి సమాచారం అందించి తాళాలు వేస్తున్న ట్లు తెలుస్తోంది. జిల్లా అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఆ అధికారిని విధుల్లో నిర్లక్ష్యం వహిస్తుందని, పలు మార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన ప్రయోజనం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయమై మండల వ్యవసాయ అధికారిని యమునా దుర్గాను వివరణ కోరగా.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతిరోజు ఫీల్డ్ విసిట్ చేయాల్సి వస్తుందని, ఈ రోజు కూడా కేస్లాపూర్‌లో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించాను. ప్రతిరోజు రైతులకు అందుబాటులోనే ఉంటున్నాను అని సమాధానం ఇచ్చారు.




