అదనంగా పిఎంసిహెచ్ బాలుర, బాలికల వసతి గృహాలు ఏర్పాటు చేయాలని ప్రజావాణిలో వినతి పత్రం
కొత్తపల్లి,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లో ప్రజావాణి లో సోమవారం రోజున భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (ఢీవైఎఫ్ఐ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గిరిజన విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా జిల్లాలో అదనంగా ఒక బాలుర, ఒక బాలికల పిఎంసిహెచ్ వసతి గృహాలను ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేష్ పటేల్ మాట్లాడుతూ... కరీంనగర్ జిల్లాలో గిరిజన విద్యార్థుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతున్నప్పటికీ వారికి అవసరమైన స్థాయిలో వసతి గృహాలు లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు.
జిల్లాలో ఎస్సీ, బీసీ విద్యార్థుల కోసం 6 నుండి 7 వరకు ప్రభుత్వ వసతి గృహాలు అందుబాటులో ఉండగా, గిరిజన (ఎస్టీ) విద్యార్థుల కోసం మాత్రం కేవలం ఒక బాలుర, ఒక బాలికల పిఎంసిహెచ్ వసతి గృహం మాత్రమే ఉండడం విచారకరమన్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా హాస్టళ్ల సంఖ్యను పెంచడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.ప్రస్తుతం ఉన్న వసతి గృహాల్లో మౌలిక వసతులను మెరుగుపరచాలని కోరారు. జిల్లా కలెక్టర్ ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి అదనంగా పిఎంసిహెచ్ బాలుర, బాలికల వసతి గృహాలను మంజూరు చేయడంతో పాటు శాశ్వత భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే గిరిజన విద్యార్థులతో కలిసి డీవైఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దశలవారీ ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.






