యూరియా.. కష్టమేనయా..!
3 నిమిషాల్లోనే.. 444 యూరియా బస్తాలు ఖాళీ.
ఆన్లైన్ కొనుగోలుపై రైతులకు అవగాహన శూన్యం
పంట ఎదగక రైతుల అవస్థలు
ఈసారికి కావాల్సినంత ఇచ్చి పాటలను కాపాడాలని రైతుల వేడుకోలు
తుంగతుర్తి, ఫిబ్రవరి 27 : గత కాలంలో.. కాయ్ రాజా కాయ్.. అనే డబ్బా లాటరీ లాగా ప్రస్తుతం రైతులకు యూరియా కొనుగోలు మారింది. రైతులు గంటల కొద్దీ ఎదురుచూసి సమయానికి బుక్ చేసే ప్రయత్నం చేయగా కొందరికి బుక్ కాగా మరి కొందరికి బుక్ కావడం లేదు. దీంతో బుక్ కానీ రైతులు అవస్థలు పడుతున్నారు. ఇంకొందరు రైతులైతే ఎలా బుక్ చేసుకోవాలో అర్థం కాక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఇద్దరు రైతులు ఎక్కడ కలిసిన ఈసారి యూరియా కష్టమేనయా అంటూ చర్చించుకుంటున్నారు.
మూడు నిమిషాల్లో ఖాళీ
జిల్లాలోని తుంగతుర్తి మండల కేంద్రంలోని రైతు సహకార సంఘంలో గురువారం ఉదయం 10:30కు ఆన్ లైన్ లో బుకింగ్ కు అవకాశం కల్పించగా కేవలం మూడంటే మూడు నిమిషాల్లోనే 444 బస్తాలు ఖాళీ అయ్యాయి. దీంతో సొసైటీ ఎదురుగా నిలబడి బుక్ చేసేందుకు సిద్ధంగా ఉన్నవారికి సైతం అవకాశం లేకుండా పోయింది. మరి కొందరు రైతులు ఆన్లైన్ చేస్తున్నప్పటికీ నెట్ సక్రమంగా లేకపోవడం, సర్వర్ స్లోగా ఉండడంతో తక్కువ సమయంలోనే జీరో చూపెట్టాయి. దీనితో రైతులు నిట్టూర్పు చెందారు.
ఒకరికి మోదం.. మరొకరికి ఖేదం.. : ఒకరి పక్క ఒకరు కూర్చొన్న రైతులు ఆన్లైన్ చేస్తుంటే, బుకింగ్ దొరికిన రైతులు ఏదో సాధించినట్లు, దొరకని వారి ముఖాల్లో బాధ కనిపించడం గమనార్హం. అసలు యాప్ పై అవగాహన లేని రైతులు ఇతరులకు డబ్బులు ఇచ్చి బుక్ చేయించుకునే ప్రయత్నం చేసినా పలితం లేకుండా పోయింది. వ్యవసాయ శాఖ అధికారులు పూర్తిస్థాయిలో రైతులకు అవగాహన కల్పించి తదుపరి ఇలా బుక్ చేయడం ప్రారంభిస్తే బాగుండేదని పలువురు రైతులు అభిప్రాయపడుతున్నారు.
పెరిగిన డిమాండ్
వాస్తవికంగా ప్రస్తుత సీజన్లో రైతులు ఎక్కువగా వేదజల్లె విధానంను అనుసరించారు. దీంతో యూరియా అవసరం బాగా పెరిగింది. ఇప్పటికైనా వ్యవసాయ శాఖ అధికారులు రైతుల ప్రయోజనాల దృష్ట్యా పీఏసీఎస్ లు, ఫెర్టిలైజర్ షాపులకు ఎక్కువ యూరియా సరఫరా చేసి ఇబ్బందులు లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.
యూరియా అందించి ఇబ్బందులు తొలగించాలి
అసలు ఫోన్ వాడడమే రైతులను యూరియా బస్తాలు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలంటే ఎలా చేస్తారు. పాసుబుక్ జిరాక్సులు తీసుకొని ఆపీస్ లకు పోతే మీరే ఆన్లైన్ చేసుకోవాలి, మాకు తెలవదు అని సొసైటీ, పెస్టిసైడ్స్ షాప్ యాజమాన్యం వాళ్లు చెబుతున్నారు. పంటకు యూరియా అందించే సమయం కాబట్టి ఈ సారి యూరియాను రైతులకు కావాల్సినంత ఇచ్చి వచ్చే సరికి వ్యవసాయ శాఖ అధికారులు పూర్తిస్థాయిలో రైతులకు ఆన్లైన్ బుకింగ్ పై అవగాహన కల్పించాలి. ఇలా చేస్తే రైతులకు ఈ సారి ఇబ్బంది ఉండదు. వచ్చేసారికి బుక్ చేసుకోగలుగుతారు.
మట్టిపెల్లి వెంకట్. అన్నారం రైతు




