6 June, 2026 | 5:22 PM

ధాన్యం అన్‌లోడ్ ఆలస్యం.. రాజీవ్ రహదారిపై రైతుల బైఠాయింపు

06-06-2026 04:17 PM

బెజ్జంకి,(విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి శివారులోని రాజీవ్ రహదారిపై రైతులు శనివారం బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మూడు రోజులుగా ధాన్యం అన్‌లోడ్ కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల కథనం ప్రకారం, బెజ్జంకి ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని లోడ్ చేసి మండల కేంద్రంలోని గోదాంకు తరలించినప్పటికీ అక్కడ నిల్వ సామర్థ్యం లేకపోవడంతో ట్రాక్టర్ల బారులు తీరాయి. అనంతరం ధాన్యాన్ని తోటపల్లి శివారులోని ఓ ప్రైవేట్ గోదాంకు మళ్లించినట్లు తెలిపారు.

అయితే అక్కడికి వచ్చిన తర్వాత కూడా ధాన్యాన్ని అన్‌లోడ్ చేయకపోవడంతో మూడు రోజులుగా ట్రాక్టర్లలోనే ధాన్యం ఉంచాల్సి వస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాల భయం ఒకవైపు, ట్రాక్టర్ల అద్దె ఖర్చులు మరోవైపు తమపై అదనపు భారం మోపుతున్నాయని రైతులు వాపోయారు. ధాన్యం అన్‌లోడ్ ప్రక్రియలో ఏర్పడిన జాప్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. సమస్య పరిష్కారం కోసం సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గోదాంల వద్ద ధాన్యం అన్‌లోడ్ ప్రక్రియను వేగవంతం చేయాలని, రైతులు మరింత నష్టపోకుండా చర్యలు చేపట్టాలని నిరసనలో పాల్గొన్న రైతులు డిమాండ్ చేశారు.