7 March, 2026 | 1:37 AM

ఏడవ రోజుకు చేరిన రైతుల రిలే నిరాహార దీక్ష

06-03-2026 04:34 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో సాగునీటి కాలువలను పూర్తి చేయాలని కోరుతూ రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శుక్రవారం నాటికి ఏడవ రోజుకు చేరుకుంది. కాలేశ్వరం ప్రాజెక్ట్ ఆర్డి–3, ఎల్‌ఎం–6, ఎల్‌ఎం–4 కాలువల పనులను తక్షణమే పూర్తి చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు వేమునేని శ్రీధర్ రావు మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాలువల విషయంలో హామీలకే పరిమితమైందని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా ఈ సమస్యను పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు.

 బీజేవైఎం మండల అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి  మాట్లాడుతూ రిలే నిరాహార దీక్ష ఏడవ రోజుకు చేరుకున్నప్పటికీ అధికారులు స్పందించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పంటలు ఎండిపోతున్నాయన్నారు. ఎండాకాలం దగ్గరపడుతున్నప్పటికీ అధికారులు స్పందించకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు వేమునేని శ్రీధర్ రావు, బీజేవైఎం మండల అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి, రాజు, ముఖేష్, పవన్, నర్సింగం, భాస్కర్, మహేందర్ తదితరులు మరియు రైతులు పాల్గొన్నారు.