13 April, 2026 | 1:55 AM

రెండో విడత ‘భరోసా’ కోసం ఎదురుచూపులు..

13-04-2026 12:23 AM

ఇరవై రోజుల క్రితం ఎకరం భూమి ఉన్న రైతుల ఖాతాల్లో జమ..

మెదక్ జిల్లాలో 2.59లక్షల మంది రైతులు... రూ.220 కోట్లు..

ఖరీఫ్‌కు సిద్ధమవుతున్న రైతులు..

గత బిఆర్‌ఎస్ ప్రభుత్వమే మేలంటున్న రైతులు

మెదక్ ఏప్రిల్ 12 (విజయక్రాంతి): రైతు భరోసా పథకం కింద మొదటి విడతలో రైతులకు ఎన్ని ఎకరాలున్నా ఒక ఎకరానికి రైతు భరోసా డబ్బులు విడుదల అయ్యాయి. డబ్బులు జమ అయి ఇరవై రోజుల కావస్తున్నా రెండో విడత డబ్బుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా గత ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన రైతు భరోసా పథకం అమలు కాలేదు. యాసంగి సమయంలో ప్రారంభించారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకూ 45 శాతం మాత్రమే సాగు సాయం అందింది. ఇంకా 55 శాతం రైతుల ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. ఖరీఫ్ సమీపిస్తున్న ఇంకా ఎదురు చూపులు తప్పడం లేదు.

కాంగ్రెస్ వచ్చాకే పథకం అమలులో జాప్యం..? 

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు భరోసా పథకం అమలులో జాప్యం జరుగుతుంది. అధికారం చేపట్టి రెండేళ్లు గడిచినా నాలుగు విడతలకు గాను రెండు విడతల్లో మాత్రమే రైతు భరోసా అందించారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల ఎకరం భూమి ఉన్న రైతులకు మాత్రమే భరోసా డబ్బులు జమ చేశారు.

మిగతా భూములకు ఎప్పుడో వస్తుందోనని రైతులు ఎదురుచూస్తున్నారు. మెదక్ జిల్లాలో 2,59,936 మంది రైతులకు గాను రూ.220కోట్లు రైతు భరోసా డబ్బులు జమ చేయాల్సి ఉంది. ముందుగా ఎకరా వరకు మాత్రమే భరోసా డబ్బులు రూ.100 కోట్లు జమ చేశారు. అంటే 45 శాతం మంది రైతులకు జమ కాగా, మరో 55 శాతం మంది రైతులకు రైతు భరోసా డబ్బులు ఎప్పుడూ జమ అవుతాయోనని రైతులు ఎదురుచూస్తున్నారు.

ఖరీఫ్ కు సిద్ధమవుతున్న రైతులు... 

గత బిఆర్ ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని అమలు చేస్తే... కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు భరోసా పథకం అమలు చేసింది. ఏడాది కాలంగా సాగు సాయం ఇవ్వకుండా పంటలు చేతికి వచ్చాకా పథకం అమలు చేయడం రైతులను అసంతృప్తికి గురి చేస్తోంది. గత బిఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ఎకరం నుంచి మొదలు ఎన్ని ఎకరాలు ఉన్నా వెంట వెంటనే డబ్బులను విడుదల చేసింది.

దీంతో రైతులు పంట పెట్టుబడి సాయం అందడంతో ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసేవారు. అంతే కాకుండా దుక్కులు దున్ని తుకాలు పోయడానికి ఉపయోగపడేవి..కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎకరా డబ్బులు జమ చేసి 20 రోజులు పూర్తయిన ఇంకా రెండు ఎకరాల నుంచి డబ్బులు జమ కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా కాకుండా ఒకేసారి రైతు భరోసా డబ్బులు జమ చేస్తే అటు పెట్టుబడి సాయం అందుతుందని రైతులు అంటున్నారు. వరి నార్లు పోయాకముందే ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు జమ చేస్తే బాగుంటుందని పలువురు రైతులు పేర్కొంటున్నారు.