సింగర్ మంగ్లీపై చీటింగ్ కేసు
పంజాగుట్టలో న్యాయవాది సుబ్బారావు ఫిర్యాదు
పంజాగుట్ట, ఏప్రిల్ 11(విజయక్రాంతి): ప్రముఖ గాయని మంగ్లీతో పాటు పలువురిపై పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. సుమారు రూ. 200 కోట్ల మేర భారీ స్కామ్ జరిగిందని, ఇందులో మంగ్లీతోపాటు ఆమె సోదరుడు శివ, రమావత్ మధు, పాల్ దియా భరత్ చౌహన్, శైలజ చౌహన్ తదితరులకు ప్రత్యక్ష్య సంబంధం ఉందని హైకోర్టు న్యాయవాది సుబ్బారావు ఫిర్యాదు చేశారు.
శనివారం పోలీస్ స్టేషన్ ఆవరణలో న్యాయవాది సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ , ఒక సంస్థను ఏర్పాటుచేసి డాక్టర్లు, ప్రముఖుల నుంచి భారీగా వసూలు చేసిన నిధులను నిందితులు తమ సొంత ఆస్తుల కొనుగోలుకు మళ్లించారని ఆయన ఆరోపించారు. ఈ కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో కూడా బాధితులు ఉన్న ట్లు ఫిర్యాదుదారులు పేర్కొంటున్నారు.
ఈ కేసులో బాధితుల తరపున పోరాడుతున్న తనను నిందితులు తీవ్రంగా బెదిరిస్తున్నార ని సుబ్బారావు ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్ర మంత్రి, ఎమ్మెల్యే కుమారుల పేర్లు చెప్పడమే కాకుండా, స్థానిక రౌడీలు, బంజారా నాయకులతో ఫోన్ చేయించి చంపేస్తామని హెచ్చరించినట్లు పేర్కొన్నారు. కేసు నుంచి తప్పుకోవడానికి పెద్దమొత్తంలో ఆశ చూపారని, దానికి నిరాకరించడంతో వేధింపులకు పాల్పడుతున్నారని ఆయన తెలిపారు.
తన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారని, బాధితులకు న్యాయం జరిగేవరకు చట్టపరంగా పోరాటం చేస్తానని ఆయన చెప్పారు. ఈ ఆరోపణలను సింగర్ మంగ్లీ వర్గం ఖండిస్తోంది. తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని పేర్కొంటూ మంగ్లీ కూడా నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. బాధితులలో ప్రముఖులు ఉండ టం, వందల కోట్ల స్కామ్ కావడంతో ఈ కేసు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. పంజాగుట్ట పోలీసులు ఈ ఫిర్యాదుపై లోతైన విచారణ జరుపుతున్నారు.




