2 June, 2026 | 1:56 AM

ధాన్యం కొనుగోలులో రైతులను దోపిడీ చేశారు

02-06-2026 01:16 AM

40 కేజీల బస్తాకి 4 కేజీల నిలువు దోపిడీ

దోపిడీ పై విచారణ చేసి రైతుకు డబ్బు తిరిగి చెల్లించాలి

నల్లగొండ టౌన్, జూన్ 1: ధాన్యం కొనుగోలులో రైతును భారీ ఎత్తున దోపిడీ చేశారని దోపిడీ చేసిన ధాన్యంపై విచారణ చేసి రైతు ఖాతాలో దోపిడి దాన్యం డబ్బులు జమ చేయాలని ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి గోలి సైదులు సోమవారం జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద దిగుమతి చేసే ధాన్యం మిల్లుల వద్ద నిబంధనలను పాటించలేదన్నారు.

40 కేజీల తూకం బస్తా కి 4 కేజీలు అదనంగా తరువు తాలుపెరిట దోపిడీ చేశారన్నారు. కన్స్యూమర్ అఫైర్స్ , ఫుడ్ అండ్ సివిల్ సప్లయస్  డిపార్ట్మెంట్ జీవో నెంబర్ .17, తేదీ: 04-10-2025 ప్రకారం ప్రతి 40 కిలోల గన్నీ బ్యాగుకు అదనంగా ఎక్కువ తూకం వేయాలని ఎక్కడా పేర్కొనలేదు. అలాగే 6.0 క్లాజ్లో తాలు గరిష్టంగా 3% వరకు (40 కిలోలకు సుమారు 1.2 కిలోలు) ఉండవచ్చని మాత్రమే పేర్కొనబడింది.

అయితే, అనేక కొనుగోలు కేంద్రాలలో తాలు పేరుతో 2 కిలోలు, వెట్ లాస్ పేరుతో అదనంగా కోత విధించడం వల్ల ఒక్కో గన్నీ బ్యాగుకు 4 కిలోల వరకు ధాన్యం రైతులు నష్టపోయినట్లు తెలిపారు. మిల్లు వద్ద దిగుమతి చేసుకునే సమయంలో లారీ మొత్తం తూకం వేసినప్పుడు తరుగు వచ్చిందని కోత విధించారని హమాలీల ఖర్చులను కూడా రైతులే భరించాల్సి వచ్చిందని తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా నల్లగొండ జిల్లాలో సుమారు 7.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగిన నేపథ్యంలో, ప్రతి 40 కిలోల బ్యాగుకు అదనంగా 4 కిలోల ధాన్యం తీసుకున్నట్లయితే రైతులకు భారీ స్థాయిలో నష్టం జరిగినట్లు అర్థమవుతోంది.

ఈ నష్టం విలువ కోట్ల రూపాయలలో ఉంటుందన్నారు జీవో నెంబర్.17, తేదీ: 04-10-2025 నిబంధనలకు విరుద్ధంగా రైతుల నుండి అదనంగా తీసుకున్న ధాన్యంపై జిల్లా రాష్ట్ర స్థాయిలో సమగ్ర విచారణ జరిపి, నష్టపోయిన ప్రతి రైతుకు తగిన పరిహారం బకాయి మొత్తాన్ని చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో కోరారు.