హుతీలపై పోరుకు తండ్రి సంతకం ఫోర్జరీ
సౌదీ యువరాజుపై తీవ్ర ఆరోపణలు
న్యూఢిల్లీ, ఆగస్టు 19: యెమెన్‌లోని హు తీ ఉగ్రవాదులపై యుద్ధం ప్రకటించేందుకు సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ తన తండ్రి సంతకాన్నే ఫోర్జరీ చేశారని సౌదీ మాజీ అధికారి ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించారు. 2015లో హుతీలపై యుద్ధం ప్రకటించేందుకు సౌదీ రాజు సల్మాన్ డిక్రీ జారీచేశారు. అయితే, ఆ డిక్రీపై ఉన్నది రాజు సంతకం కాదని, యువరాజు ఎంబీఎస్ తన తండ్రిలాగే సంతకం పెట్టి యుద్ధ ప్రకటన చేయించారని ఆ దేశ మాజీ ఇంటెలిజెన్స్ అధికారి అల్ జబ్రి ఆరోపించారు. ఆయన ప్రస్తుతం సౌదీ నుంచి పారిపోయి కెనడాలో తలదాచుకొంటున్నా రు. బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం తెలిపారు.
రాజు సల్మాన్ వృద్ధుడు కా వటంతో యువరాజే రాజుగా వ్యవరిస్తున్నారని, అధికారులతో ఆయనే సమావేశాలు నిర్వహిస్తున్నారని చెప్పాడు. రాజు మానసిక పరిస్థితి కూడా బాగా లేదని వెల్లడించారు. దీన్ని అవకాశంగా తీసుకొన్న ఎంబీఎస్ హుతీలపై యుద్ధ డిక్రీపై తానే సంతకం చేశాడని ఆరోపించారు. ఇరాన్ మద్దతున్న హుతీ ఉగ్రవాదులు యెమెన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్నేండ్లుగా పోరాడుతున్నారు. ఇరాన్‌కు బద్ద విరోధి అయిన సౌదీ హుతీలను అణచివేసేందుకు 2015లో ప్రత్యక్ష పోరుకు దిగింది. అప్పటి నుంచి పోరాటం కొనసాగుతూనే ఉన్నా ఫలితం మాత్రం తేలలేదు. ఈ ఘర్షణల్లో ఇప్పటికే లక్షన్నర మంది మరణించారు.






