ప్రతి విద్యార్థి ఒక మొక్కను నాటి సంరక్షించాలి
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, భవిష్యత్ తరాల కోసం విస్తృతంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పిలుపునిచ్చారు. మంగళవారం పెద్ద ముద్దునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వన మహోత్సవంలో కలెక్టర్ పాల్గొని విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. పాఠశాల ఆవరణలో జామ, నేరేడు, మామిడి తదితర 100 మొక్కలను విద్యార్థులు నాటారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి ఒక మొక్కను నాటి కుటుంబ సభ్యుడిలా భావించి సంరక్షించాలని సూచించారు. మొక్కలు వాతావరణ సమతుల్యత, భూగర్భ జలాల పరిరక్షణకు ఎంతో ఉపయోగ పడతాయన్నారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి రేవంత్ చంద్ర, సర్పంచ్ ఊర్మిలమ్మ, ఎంపీడీవో చెన్నమ్మ, ఎంఈవో కురుమయ్య, ప్రధానోపాధ్యాయుడు మోహనాచారి, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.






