నూతన సూపరింటెండెంట్‌కు ఘన సన్మానం
- మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆకాంక్ష
మణుగూరు టౌన్,(విజయక్రాంతి): మణుగూరులోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నూతన సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ ముదిగొండ రామకృష్ణను సిద్దార్థ కాలేజీ ప్రిన్సిపాల్ వల్లభనేని అజయ్ కుమార్ ఆధ్వర్యంలో కళాశాల సిబ్బంది, సుమారు 100 మంది విద్యార్థులు శనివారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి చేరుకున్న కళాశాల బృందం నూతన సూపరింటెండెంట్‌కు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ వల్లభనేని అజయ్ కుమార్ మాట్లాడుతూ, మణుగూరు ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఎంతో కీలకమైనదని అన్నారు. నూతన సూపరింటెండెంట్ డాక్టర్ ముదిగొండ రామకృష్ణ నాయకత్వంలో ఆసుపత్రి మరింత అభివృద్ధి చెందడంతో పాటు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు.
అదేవిధంగా సిద్దార్థ కాలేజీ విద్యార్థులకు వైద్యరంగంపై అవగాహన కల్పించడం, ఆసుపత్రిలో అందుతున్న వివిధ సేవలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం, ప్రాక్టికల్ శిక్షణ వంటి అంశాల్లో భవిష్యత్తులో సహకారం అందించాలని నూతన సూపరింటెండెంట్‌ను కోరారు. విద్యార్థులు వైద్య సేవలపై అవగాహన పెంపొందించుకోవడం ద్వారా సమాజంలో ఆరోగ్యంపై మరింత చైతన్యం తీసుకురావచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్దార్థ కాలేజీ సిబ్బంది, విద్యార్థులు, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






