18 June, 2026 | 1:42 AM

ఎరువుల దుకాణాలను మ్యాపింగ్ చేయాలి

18-06-2026 12:00 AM

జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) జూన్ 17 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఎరువులు, విత్తనాలు విక్రయించే అన్ని దుకాణాలను మ్యాపింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో ఎరువులు, విత్తనాల విక్రయాలు, మ్యాపింగ్, రైతు రిజిస్ట్రీ తదితర అంశాలపై వ్యవసాయ, సహకార, పంచాయతీ రాజ్ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న 38 రైతు వేదికల ద్వారా ఎరువులు, విత్తనాల విక్రయాలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 15 రైతు వేదికల మ్యాపింగ్ పూర్తయిందని, మిగిలిన 23 రైతు వేదికల మ్యా పింగ్ను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి విక్రయాలు ప్రారంభించాలని ఆదేశించారు.

రైతులు యూరియాను యాప్ ద్వారా బుకింగ్ చేసుకుని పొందేలా వారికి విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వం సూచించిన ధాన్యం సాగు విధానాలపై రైతుల్లో అవగాహన పెంచేందుకు డిపిఆర్‌ఓ ద్వారా కళాజాత ప్రదర్శనలు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు.

నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం

నకిలీ విత్తనాల విక్రయదారులపై అత్యంత కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, పోలీసు కేసులు నమోదు చేసి, వారి లైసెన్సులను తక్షణమే రద్దు చేయాలని ఆదేశించారు. విక్రయ కేంద్రాల వద్ద పటిష్టమైన పర్యవేక్షణ ఉండాలని, ప్రతి విక్రయ కేంద్రంలో మండల స్థాయి అధికారి, పోలీసు పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. ఎరువుల విక్రయాల ప్రక్రియ మొత్తాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పర్యవేక్షిస్తారని కలెక్టర్ వివరించారు.

ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తి చేయాలి

మండలాల వారీగా ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు ప్రక్రియను సమీక్షించిన కలెక్టర్, జిల్లాలో ప్రస్తుత నమోదు కేవలం 66.77 శాతం మాత్రమే కావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన శాతాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వీటితో పాటు సాంప్రదాయ యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో యూరియా వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించాలని సూచించారు.

ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి బాపూరావు, సహకార శాఖ అధికారి వాలియా నాయక్, వ్యవసాయ శాఖ ఏడీఏలు రమేష్, శ్రీపాల్, అన్ని మండలాల వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్ కు అభినందనల వెల్లువ

జిల్లా కలెక్టర్ గా రాహుల్ శర్మ పదవి బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తి చేసిన సందర్భంగా వివిధ శాఖల అధికారులు, కలెక్టర్ కార్యాలయ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా టీం వర్క్ చేయడం వల్ల జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా పయనిస్తుందని చెప్పారు.